ఆదివారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2025
ఓనమాలు దిద్దిన పాఠశాల/కళాశాల కోసం మహా అయితే.. పూర్వ విద్యార్థులుగా కొంత మొత్తం విరాళం ఇస్తాం. లేకుంటే అక్కడ అవసరాలను గుర్తించి సమకూరుస్తాం. నలుగురికీ విద్యాబుద్ధులు నేర్పి, అన్నం పెట్టిన ఆ విద్యాలయం ‘అమ్మ’నే స్ఫూర్తిగా తీసుకుని.. పేదలకు పట్టెడన్నం పెట్టడం.. అది కూడా నిరంతరాయంగా నేటికి 1,247 రోజులుగా కొనసాగించడం సాహసమే. అది చేసి చూపించారు పార్వతీపురంలోని జిల్లెళ్లమూడి అమ్మ సేవా సమితి సభ్యులు. విశ్రాంత గురువులు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న అన్నసంతర్పణ క్రతువుకు ‘సాక్షి’ అక్షరరూపం.
అమ్మ సేవా సమితిగా..
గుంటూరు ప్రాంతంలో జిల్లెళ్లమూడి అనసూయ మహాదేవి అంటే తెలియని వారుండరు. 1956లోనే అన్నపూర్ణ ఆలయం కట్టారు. ఏ వేళయినా.. ఆకలి అని వచ్చేవారికి, ఆమె ఇంట ఉచితంగా నిత్యం ఆహారం లభిస్తూనే ఉండేది. ‘అమ్మ’లా కమ్మని భోజనం పెట్టి పంపేవారు. జిల్లెళ్లమూడిలోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలకు కూడా ఆమే వ్యవస్థాపకురాలు. తన కళాశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు పైసా కూడా ఆశించకుండా భోజనం పెట్టేవారు. ఆ అమ్మ స్ఫూర్తితోనే ‘జిల్లెళ్లమూడి అమ్మ సేవా సమితి’ పేరిట పార్వతీపురంలో ఉంటున్న పూర్వ విద్యార్థులంతా ఒక సంస్థగా ఏర్పడ్డారు. ప్రస్తుతం 65 మంది సభ్యులున్నారు. దాదాపు అధిక శాతం మంది విశ్రాంత ఉపాధ్యాయులే. ఇతర రంగాల్లో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులూ ఉన్నారు. కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా మొదట్లో అన్న వితరణ ప్రారంభించారు. ఆ తర్వాత ‘అమ్మ’ని ఆదర్శంగా తీసుకుని, మూడేళ్లకుపైగా పార్వతీపురం జిల్లా ఆసుపత్రి వద్ద రోగుల సహాయకులకు, గిరిజనులకు, గర్భిణులకు నాణ్యమైన భోజనం ఉచితంగా పెడుతున్నారు. ఎవరి వద్ద కూడా రూపాయి అయినా ఆశించరు. ప్రతి నెలా ఇందులోని సభ్యులే తలో రూ.వెయ్యి సమకూర్చుకుంటారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతల సహకారమూ తీసుకుంటున్నారు. అన్నం, సాంబారు, కూరతో రోజుకు 120 మందికిపైగా భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.1,40,000 వరకు ఖర్చు చేస్తున్నారు. చదువుకున్న కళాశాలతో ఉన్న అనుబంధాన్ని మరువలేక.. పేదల ఆకలి తీర్చేలా అ‘విశ్రాంతంగా’ ఈ విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేస్తున్న కృషిని ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు అభినందిస్తున్నారు.
● విశ్రాంత ఉద్యోగుల ఉదారత
● 1,247 రోజులుగా అన్నదానం
● రోగులు, పేదల ఆకలి తీర్చుతున్న విశ్రాంత గురువులు
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment