ఆ వీధులన్నీ
జాతీయ నాయకులవే..!
● ఒక్కో వీధికి ఒక్కో నాయకుడి పేరు
● వస్త్రపురికాలనీలో వివాదాలకు
దూరంగా ప్రజల జీవనం
రాజాం:
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన విధానాలు మారుతున్నాయి. పరుగుపెడుతున్న సాంకేతికతతో పాటు ప్రజలు కూడా పరుగులు తీస్తున్నారు. ఈ ప్రయాణంలో కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కాగా, ఆ కుటుంబ పెద్దలు కూడా గుర్తులేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ నాయకుల పేర్లు గుర్తుండడమే గగనం. ఇలాంటి స్థితిలో కూడా కొన్ని ప్రాంతాల్లో జాతీయ నాయకులు, స్వాతంత్య్ర పోరాటయోధులను గుర్తుంచుకునేవారు ఉన్నారు. ఈ కోవలోకే వస్తుంది రాజాం మున్సిపాల్టీ పరిధిలోని వస్త్రపురికాలనీ. ఈ కాలనీలోని ప్రజలు తమ వీధులకు జాతీయ నాయకుల పేర్లు పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే తమ జీవనాన్ని కూడా కొనసాగిస్తున్నారు.
20 ఏళ్లుగా కాలనీ..
రాజాం మున్సిపాల్టీగా ఏర్పడక ముందే వస్త్రపురి కాలనీ ఉంది. 2002లో ఇక్కడ అధికంగా నివాసాలు పెరిగాయి. అప్పట్లో ఇక్కడ నివాసాలు ఏర్పర్చుకున్నవారిలో దేశభక్తి, జాతీయభావాలు కలిగిన వారు అధికంగా ఉన్నారు. వారంతా కలిసి తాము నివసిస్తున్న కాలనీలోని ఒక్కో వీధికి ఒక్కో జాతీయ నాయకుడి పేరు పెట్టుకోవాలని సంకల్పించారు. అప్పట్లో తీసుకున్న ఆ నిర్ణయం మేరకు ఒక వీధికి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీధి అని, మరో వీధికి వివేకానంద వీధి అని, ఇంకో వీధికి సుభాష్ చంద్రబోష్ వీధి అని, భగత్‌సింగ్, జాన్సీ లక్ష్మీభాయి, చత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు తదితర పేర్లతో వీధులకు బోర్డులు పెట్టారు. ఆయా జాతీయ నాయకులను స్మరించుకోవడంతో పాటు ఇప్పటికీ ఆ జాతీయ నాయకుల వర్థంతి, జయంతులను ఇక్కడి వారు కులమతాలకు అతీతంగా నిర్వహిస్తుంటారు. మొత్తం 400 మందికి పైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో ఏడు వీధులు ఉన్నాయి. అన్ని వీధులకు సీసీ రోడ్లు, మురుగుకాలువలు, తాగునీటి సదుపాయం ఉంది. వాటిని పొదుపుగా వీరు వినియోగించుకుంటున్నారు.
క్లీన్ అండ్ గ్రీన్‌గా..
వస్త్రపురికాలనీ నిత్యం క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంటుంది. చిన్నచిన్న వీధులతో ఉన్నప్పటికీ ఇక్కడి వారంతా సమన్వయంగా వ్యవహరించడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం విశేషంగా మారింది. ఏ పండగైనా, శుభకార్యక్రమమైనా గొప్పగా నిర్వహించుకుంటారు. ఎటువంటి వివాదాలు, రాజకీయ ద్వేషాలు లేని వార్డుగా రాజాం మున్సిపాల్టీలో ఈ వార్డుకు పేరొంది.
ఎవరి పనిలో వారు
వస్త్రపురికాలనీలో ఉన్నవారంతా రోజంతా బిజీగా ఉంటారు. ఎవరు పని వారుచేసుకోవడం, కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం చేస్తుంటారు. ఇక్కడ పెద్దగా వివాదాలు ఉండవు. కులమత తారతమ్యాలకు తావుండదు. 2002లో ఇక్కడికి మేం వచ్చి స్థిరపడ్డాం. ఇక్కడి నుంచీ ఇంకెక్కడికీ వెళ్లాలని అనిపించదు.
–ఎంవీ ప్రసాదరావు, ఎంఈఓ, వస్త్రపురికాలనీ
అందరూ కలిసికట్టుగా
వస్త్రపురికాలనీ అనగానే ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. పట్టణానికి చివర్లో ఉన్నప్పటికీ ఉపాఽధినిచ్చే పరిశ్రమలకు దగ్గరగా ఈ గ్రామం ఉంది. అందరికీ నిత్యం ఏదో ఒక పని ఉంటుంది. తమ పని తాము చేసుకుంటూ, ఇతరుల కష్టసుఖాల్లో కలిసికట్టుగా జీవిస్తుంటారు. ఇదే ఇక్కడి ప్రశాంత వాతావరణానికి కలిసివచ్చే అంశం.
–చప్పటి పెంటయ్య, వస్త్రపురికాలనీ, రాజాం
Comments
Please login to add a commentAdd a comment