ఆర్టీసీలో సంక్రాంతి సందడి
● జిల్లా నుంచి పండగకు ప్రత్యేక బస్సులు
● ఈ నెల 10 నుంచి 15 వరకు సర్వీసులు
● తిరుగు ప్రయాణం ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు
● హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణానికి సర్వీసులు
● రానుపోను టికెట్ బుకింగ్‌పై పది శాతం రాయితీ
● ప్రజా రవాణాకు బస్సులు సిద్ధం
పార్వతీపురం టౌన్:
ఆర్టీసీలో సంక్రాంతి సందడి మొదలైంది. తెలుగువారి పెద్ద పండగకు సొంతూరు వచ్చి వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రణాళికా బద్ధంగా సేవలందించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం తదితర దూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చే వారి కోసం, తిరుగు ప్రయాణాలకు జిల్లాలోని పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోల నుంచి 250 ప్రత్యేక బస్సు సర్వీసులు, 300 షెడ్యూల్ బస్సు సర్వీసులు నడపాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక బస్సులు నడిపే అంశంపై జిల్లా ప్రజా రవాణా అధికారి కె.శ్రీనివాసరావు మూడు డిపోల మేనేజర్‌లు, ఆధికారులతో సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయి ఆదేశాలు జారీచేశారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కులగకుండా సమయానికి బస్సు సర్వీసులు ఉండేలా చర్యలు చేపట్టారు.
10 శాతం రాయితీ..
ఏసీ, అల్ట్రాడీలక్స్, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ వంటి అన్ని సర్వీసులకు రానుపోను ఒకేసారి టికెట్ తీసుకున్న సంక్రాంతి ప్రయాణికులకు చార్జీలో 10 శాతం రాయితీ కల్పించారు. ప్రత్యేక సర్వీసులకు అదనపు చార్జీలు లేకుండా పేద మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుని 10 శాతం రాయితీ కల్పించడంపై ప్రయాణికులు ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటున్నారు.
హైదరాబాద్‌కు సర్వీసులు ఇలా..
ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా నుంచి హైదరాబాద్‌కు బస్సులు నడువకపోవడం, ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని చెక్ పెట్టేందుకు సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఆర్టీసీ 14 ప్రత్యేక బస్సులతో సర్వీసులు నడుపుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు రూ.1800 నుంచి రూ.3000 వసూలు చేస్తున్నారు. కానీ, ఆర్టీసీలో మాత్రం రూ.1360 సూపర్ లగ్జరీ, రూ.1290 ఆల్ట్రా డీలక్స్ బస్సులలో ప్రయాణించవచ్చు.
విజయవాడ, విశాఖపట్నానికి ఇలా..
జిల్లా నుంచి విజయవాడకు ప్రస్తుతం రోజుకు 7 బస్సులు నడుస్తండగా పండగ సందర్భంగా ప్రతిరోజూ మూడు డిపోల నుంచి 3 చొప్పున 15 అదనపు సర్వీసులు నడపనున్నారు. జిల్లా నుంచి విశాఖపట్నానికి ప్రతిరోజూ 85 బస్సు సర్వీసులు ఉండగా ప్రతిరోజూ డిపోకు 10 చొప్పున మూడు డిపోల నుంచి 30 అదనపు బస్సులను నడపనున్నారు. సంక్రాంతి సెలవులు, తిరుగు ప్రయాణాల సందర్భంగా ఎవరు, ఎక్కడికి, ఎన్ని టిక్కెట్లు అడిగినా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాం
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రానుపో ను ఒకేసారి టికెట్ తీసుకున్న సంక్రాంతి ప్రయాణికులకు చార్జీలో 10 శాతం రాయితీ కల్పించాం. జిల్లా నుంచి హైదరాబాద్‌కు 12 బస్సులు, ప్రతీ రోజూ విజయవాడకు 15 అదనపు సర్వీసులు, విశాఖపట్టణానికి 175 బస్సు సర్వీసులు వేశాం. ప్రయాణికులందరూ ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలి. సంస్థ పురోగతిలో భాగస్వాములు కావాలి. – కొట్టాన శ్రీనివాసరావు, జిల్లా
ప్రజారవాణా అధికారి, పార్వతీపురం మన్యం
Comments
Please login to add a commentAdd a comment