చంద్రన్న ఉచ్చులో.. నేతన్న విలవిల!
రామభద్రపురం:
హామీలతో ఊరించడం.. ఊహల్లో విహరింపజేయడం.. అవసరం తీరాక మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ఇప్పుడు ఆ ఉచ్చులో చేనేత కార్మికులు చిక్కుకున్నారు. సర్కారు నుంచి కనీస సాయం అందక విలవిల్లాడుతున్నారు. సంక్రాంతి వస్తున్నా నేతన్న కుటుంబాల్లో పండగ కళ కనిపించడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కొన్నికుటుంబాలకు పూటగడవడమే గగనంగా మారింది. పస్తులతో కాలం వెల్లదీస్తున్నా వారి గురించి కనీసం పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు అప్పులు చేసి చేనేత సంఘాలు నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధరలేకపోవడంతో పరిశ్రమ కాస్త చిక్కుల్లో పడింది. పలు సంఘాలు మూతదిశగా పయనిస్తున్నాయి. చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎన్టీ రామారావు హయాంలోని చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తామని, చేనేత ఉత్పత్తులపై 90 శాతం రిబేటు ఇస్తామంటూ 2024 ఎన్నికల ముందు హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడంలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే చేనేత కార్మికులు మగ్గం విడిచి వ్యవసాయ కూలిపనులు, భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు.
నేతన్నకు అండగా నిలిచిన జగనన్న...
చేనేత రంగానికి గత సీఎం జగనన్న అండగా నిలిచారన్నది నేతన్నల మాట. సొంత మగ్గం ఉన్న నేత కార్మికుల కుటుంబాలకు వైస్సార్ నేతన్న నేస్తం పథకం కింద నెలకు రూ.2 వేల చొప్పున ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఐదేళ్లలో సరాసరి జిల్లాలో 750 చేనేత కుటుంబాలకు రూ.9 కోట్ల సాయం అందజేసి ఆదుకున్నారు. అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు అమ్మ ఒడి, చేయూత, పింఛన్, వాహనమిత్ర, ఆరోగ్యశ్రీ తదితర పథకాలతో ఆర్థిక భరోసా కల్పించారు. ఇల్లులేని కుటుంబాలకు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.1.80లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఉచితంగా ఇసుక సరఫరాతోపాటు రాయితీపై నిర్మాణ సామగ్రిని సమకూర్చి ఇంటి భాగ్యం కల్పించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేనేత సంఘాల రుణాల మాఫీతో పాటు పావలా వడ్డీకే రుణ సదుపాయం, కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్, వస్త్రాలకు గిట్టుబాటు ధర కల్పిస్తే.. తండ్రి బాటలోనే జగన్‌మోహన్‌రెడ్డి కూడా నేతన్నకు అండగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment