పల్లెల్లో పందాల జోరు
వీరఘట్టం: సంక్రాంతి పండగ నేపథ్యంలో పల్లెల్లో కోడి, పొట్టేళ్ల పందాలు జోరందుకున్నాయి. వేకువజామున, సాయంత్రం వేళల్లో పందాలు నిర్వహిస్తున్నారు. వీరఘట్టం మండలం నడిమికెల్ల శివారులో పొట్టేళ్లు పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్‌ఐ జి.కళాధర్ తన సిబ్బందితో మంగళవారం దాడిచేశారు. పందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు. వారినుంచి రూ.3020లను స్వాధీనం చేసుకున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లోనే...
కోడి, పొట్టేళ్ల పందాలకు వీరఘట్టం మండలంలోని సరిహద్దు ప్రాంతాలు అనువుగా ఉన్నాయి. గరుగుబిల్లి మండలంలోని రావివలస–వీరఘట్టం మండలంలోని కంబర సరిహద్దు మామిడి తోటలు, పాలమెట్ట (పి.వి.ఆర్.పురం) నాగావళి నదీతీర ప్రాంతం, పనసనందివాడ–తలవరం, తెట్టంగి, నడిమికెల్ల సరిహద్దు మామిడి తోటలు, హుస్సేనుపురం మామిడి తోటల్లో ఎక్కువగా పందాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పోలీసులు దాడిచేసిన సమయంలో తప్పించుకునే మార్గాలు ఇక్కడ పుష్కలంగా ఉండడంతో నిర్వాహకులు ఈ ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. గతేడాది నవంబర్ 25న తెట్టంగి తోటల్లో జరిగిన పొట్టేళ్ల పందాలపై పోలీసులు దాడులు చేశారు. పదుల సంఖ్యలో పందెం రాయుళ్లు పాల్గొనగా ఇద్దరు మాత్రమే పట్టుబడ్డారు.
కఠిన చర్యలు తప్పవు
కోడి, పొట్టేళ్ల పందాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పాలకొండ డివిజన్‌లో ఎక్కు వగా వీరఘట్టం, గరుగుబిల్లి మండలాల సరిహద్దులో పందాలు నిర్వహిస్తున్నట్టు సమాచా రం ఉంది. ప్రత్యేక నిఘా పెట్టాం. నలువైపులా దాడులు చేసి నిర్వాహకులను పట్టుకుంటాం.
– ఎం.రాంబాబు, డీఎస్పీ,
పాలకొండ డివిజన్
Comments
Please login to add a commentAdd a comment