ఐసీటీతో జేఎన్‌టీయూ జీవీ ఒప్పందం
విజయనగరం అర్బన్: కేంద్ర ప్రభుత్వం చైన్నెయ్‌లో స్థాపించిన ఐసీటీ అకాడమీతో జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) నైపుణ్యాల అభివృద్ధిపై మౌలిక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు యూనివర్సిటీలో మంగళవారం జరిగిన ఒప్పంద కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి మాట్లాడారు. మానవ వనరుల నైపుణ్యాలను పెంపొందించడంలో ఐసీటీ అకాడమీ సహకరిస్తుందన్నారు. అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందించి అకడమిక్, పరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్, ఐసీటీ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ జి.సరవణన్, రాష్ట్ర ప్రతినిధి దినకర్ రెడ్డి సంతకాలు చేసి అంగీకార పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో అకడమిక్ ఆడిట్ డైరెక్టర్, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, పరిశ్రమ సంబంధాలు, ప్లేస్‌మెంట్స్ ఇన్‌చార్జి డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ జి.జె.నాగరాజు, విశాఖ ప్రాంత సంబంధాల మేనేజర్ యాకాల సురేష్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment