పండగ విషాదం..వేర్వేరు ప్రమాదాల్లో పలువురి మృతి
బొండపల్లి: సంక్రాంతి పండగ వేళ వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఓ బైక్‌ను ఢీకొట్టడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఆ కుటుంబాల్లో తీవ్రవిషాదం నెలకొంది. మంగళవారం వేకువ జామున చోటు జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై యు.మహేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బొండపల్లి పంచాయతీ పరిధి మధుర చందకపేట గ్రామానికి చెందిన వెలుగుల లవణ్‌కుమార్(25)తో పాటు ఒడిశాకు చెందిన రక్ష్మిణ్ రంజన్‌దాస్(25)లు గొట్లాం వద్ద గల బైపాస్ రోడ్డు నుంచి బైక్‌పై వెళ్తుండగా అదే రోడ్డుపై వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టి సుమారు వంద అడుగుల దూరం వరకు బైక్‌ను ఈడ్చుకుని వెళ్లడంతో ట్యాంకర్ కింద పడిన ఇద్దరు తీవ్ర గాయాల పాలై అక్కడిక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ గజపతినగరంలోని రిలయన్స్ ట్రెండ్స్ బట్టల దుకాణంలో కొద్ది రోజులుగా పని చేస్తున్నారు. ఆ రాత్రి సమయంలో ఆటు వైపు ఎందుకు వెళ్లారో వివరాలు తెలియ రాలేదు.
లవణ్ కుటుంబంలో తీవ్ర విషాదం
వెలుగుల లవణ్ కుమార్‌కు ఏడాదిన్నర క్రితం చైతన్య లక్ష్మితో వివాహం అయ్యింది. వారికి నాలుగు నెలల కిందట బాబు పుట్టగా ఈనెల 20 వతేదీన వైభవంగా బారసాల వేడుకను కుటుంబసభ్యులు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తీరా కుటుంబసభ్యులందరూ ఆనందంగా ఉన్న సమయంలో, సంక్రాంతి పండగ వేళ ఇటువంటి దురదృష్టకర సంఘటన సంభవించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మహారాజా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గంట్యాడ మండలంలోని రామవరం వద్ద ఈనెల 13తేదీన ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో రామవరం గ్రామానికి చెందిన పి.వాసు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ మహిళ..
సీతానగరం: మండలంలోని బూర్జ గ్రామంలో స్నానాలు చేయడానికి కర్రలతో నీరువేడి చేస్తున్న సమయంలో చీరకు నిప్పంటుకుని గాయాలపాలైన మహిళ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బూర్జగ్రామానికి చెందిన అల్లు విజయలక్ష్మి ఈనెల 10 ఉదయం 8.30 గంటల సమయంలో స్నానానికి వంటకలపతో నీళ్లు కాచేందుకు మంట పెట్టింది. మంటపెట్టి వేరే పని చూస్తుండగా ఆమె కట్టుకున్న పాలిస్టర్ చీరకు మంట తగలడంతో శరీరంపై గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని పార్వతీపురం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. మృతురాలి భర్త జగ్గునాయుడు ఫిర్యాదు మేరకు ఏఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సువర్ణముఖి నది గోతిలో పడి యువకుడు..
సీతానగరం: మండల కేంద్రంలోని సువర్ణముఖి నది గోతిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు బుధవారం అందించిన వివరాలిలా ఉన్నాయి. పెదభోగిలి గ్రామానికి చెందిన సురగాల అనుదీప్(27)తన చెల్లి, బంధువులతో పాటు మంగళవారం మధ్యాహ్నం సువర్ణముఖి నదిపై ఉన్న ఆర్‌అండ్‌బీ బ్రిడ్జి సమీపంలో స్నానాలు చేశారు. అందరూ స్నానాలు చేసుకుని ఒడ్డుకు చేరిన సమయంలో ఇసుక తీసిన గోతిలో అనుదీప్ మునిగి పోవడంతో బయటకు రాలేకపోవడాన్ని గుర్తించిన చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సై ఎం.రాజేష్ అనుదీప్‌ను బయటకు తీసి 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా అనుదీప్ మృతిచెందాడు. అనుదీప్‌కుమార్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై లక్ష్మణరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.
ఎడ్లు పరుగు ప్రదర్శనలో ఆపశ్రుతి
వేపాడ: మండలంలోని కృష్ణారాయుడుపేట గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన ఎడ్ల పరుగు ప్రదర్శనలో అపశ్రుతి దొర్లింది. దీనిపై వల్లంపూడి ఎస్సై బి.దేవి అందించిన వివరాలిలా ఉన్నాయి. పరుగు ప్రదర్శనలో ఎడ్లు అదుపుతప్పి జనాల్లోకి వెళ్లిపోయాయి. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో ఆర్‌వైఅగ్రహారానికి చెందిన ఇండుగుబిల్లి సన్యాసిరావు ఉరఫ్ నాయుడు (45) అనే వ్యక్తి ఛాతీపై నుంచి బంఢి వెళ్లిపోవడంతో ఛాతీ నొప్పి వస్తోందని కె.కోటపాడు ఆస్పత్రిలో చూపించుకున్నారు. చికిత్సపొందుతూనే చనిపోయినట్లు ఆస్పత్రి నుంచి సమాచారం అందిందని ఎస్సై తెలిపారు. మృతి చెందిన నాయుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
గంట్యాడ: మండలంలోని రామవరం గ్రామం వద్ద బుధవారం జరిగిన రోగ్గు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో మహిళ గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా కంచరపాలెంకు చెందిన కె. ప్రకాశరావు (45), డెంకాడ మండల కేంద్రానికి చెందిన రాయవరపు చంద్రమ్మలు విజయనగరంలోని కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ఆటో ఎక్కి గంట్యాడ వైపు వస్తున్నారు. రామవరం గ్రామ సమీపం వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆటోలో వస్తున్న ప్రకాశరావు, చంద్రమ్మలకు గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108 అంబులెన్సులో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రకాశరావు మృతి చెందాడు. చంద్రమ్మ చికిత్స పొందుతోంది. ప్రకాశ్ రావు బంధువుల పోన్ నంబర్ దొరకలేదని ఎస్సై సాయికృష్ణ తెలిపారు. అతని వివరాలు తెలిసిన వారు 9121109442కు తెలియజేయాలని కోరారు.
బైక్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్
ప్రమాద స్థలంలోనే ఇద్దరు యువకుల మృతి
వంద అడుగుల వరకు బైక్‌ను ఈడ్చుకు వెళ్లిన ట్యాంకర్
Comments
Please login to add a commentAdd a comment