ప్రిజంకు ప్రధానమంత్రి అవార్డు
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రిజం–10 ప్రాజెక్టుకు ప్రధానమంత్రి అవార్డు లభించింది. ప్రిజం 10లో భాగంగా ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులలో రక్తహీనత నివారణకు 2023–24 సంవత్సరంలో పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. అప్పటి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామ స్థాయిలో రక్తహీనత కమిటీలు ఏర్పాటు చేయడం, నిశితంగా పర్యవేక్షణ చేయడం ద్వారా గణనీయమైన ఫలితాలు సాధించారు. ప్రధానంగా పాచిపెంట మండలంలో మరిన్ని మంచి ఫలితాలు లభించాయి. పాచిపెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేసిన లక్ష్మీకాంత్ మండలంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం సత్ఫలితాలనిచ్చింది. పౌష్టికాహారం అందించడమే కాకుండా దత్తత అధికారులను గ్రామస్థాయిలో ఏర్పాటు చేసి రక్తహీనత కలిగిన వారిని దత్తత తీసుకోవడం, వారు పర్యవేక్షణ నిర్ధిష్టంగా చేయడం.. కొంతమంది దత్తత అధికారులు స్వయంగా సొంతంగా ఖర్చు చేసి డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహార పదార్థాలను అందించడం వల్ల పిల్లల్లో రక్తహీనత చాలావరకు తగ్గు ముఖం పట్టింది. ప్రస్తుత కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కూడా రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో రక్త హీనత నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రిజం కార్యక్రమానికి ప్రశంసలు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెల 21న ఢిల్లీలో జరిగే బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అప్పటి కలెక్టర్ నిశాంత్ కుమార్ బహుమతిని అందుకోనున్నారు.
2023–24లో చేపట్టిన రక్తహీనత నివారణ చర్యలకు గుర్తింపు
జిల్లా అధికార యంత్రాంగానికి
ప్రశంసలు
అవార్డు అందుకోనున్న అప్పటి
కలెక్టర్ నిశాంత్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment