అందరి సహకారంతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట
పార్వతీపురం: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా వాల్‌పోస్టర్లు, కరపత్రాలను గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల సంస్థ, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రహదారులపై సురక్షిత ప్రయాణం(సడక్ సురక్ష అభియాన్) ప్రచారం – 2025లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలను కల్పించనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతా ప్రచార సామగ్రి, కరపత్రాలు, బ్రోచర్లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రోడ్డు భద్రత అవగాహన కోసం వలంటీర్లను గుర్తించి శిక్షణ ఇవ్వడం, వాహన డ్రైవర్లకు ఆరోగ్య తనిఖీ, కంటి పరీక్షలు నిర్వహించడం, రోడ్డు భద్రత అమలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యకలాపాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎన్‌హెచ్, ఎస్హెచ్లలో బ్లాక్ స్పాట్లను సరిదిద్దడానికి వ్యూహాన్ని సిద్ధం చేయడం, శిక్షణ పొందిన వలంటీర్లు కళాశాల విద్యార్థులతో వాకథాన్ నిర్వహించడం, వివిధ కార్యక్రమాలు ద్వారా రోడ్డు ప్రమాదాలకు గల వివిధ కారణాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్.శోభిక, జిల్లా రవాణా అధికారి టి.దుర్గాప్రసాద్ రెడ్డి, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.శశికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి.సీతారాం, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జి.సత్యనారాయణ, ఎన్.రమేష్‌కుమార్, బి.కాశిరాంనాయక్, మెడికల్ ఆఫీసర్ పి.నారాయణరావు, హోంగార్డులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment