కలిసొచ్చిన కంది
మార్కెట్ సౌకర్యం కల్పించాలి
కందికి సరైన మద్దతు ధరలు ఉంటే ఈ ఏడాది మంచి ఆదాయాలు ఉంటాయి. గతంలో సరైన పంట లేదు. ఈ సంవత్సరం మాత్రం చాలా చోట్ల ఈ పంటను వేయడం జరిగింది. అధికారులు మార్కెట్ సౌకర్యం కల్పించే విధంగా చూడాలి.
– ఎస్.షోడంగ, కిండ్రువాడ
పెట్టుబడులు పెరిగాయి
వివిధ పంటలకు పెట్టుబడులు పెరిగాయి. కంది పంటకు కూడా పెట్టుబడులు ఎక్కువే. పంట వేసిన దగ్గర నుంచి చేతికొచ్చే వరకు చాలా ఖర్చులు అవుతున్నాయి. కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు. పండించిన పంటలకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి.
– ఎం.ఫల్గుణరావు, పాండ్ర
●
● కంది కాసింది
● పెరిగిన దిగుబడి
● టీఎస్‌పీలో 2,500ల ఎకరాల్లో సాగు
● ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి
సీతంపేట: కంది దిగుబడి ఈ ఏడాది గిరిజనులకు కలిసొచ్చింది. దిగుబడి పెరగడంతో గిరిజనులు సంబరపడుతున్నారు. గత సంవత్సరం అసాధారణ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం కంది పంట ఆశాజనకంగా ఉందని రైతులు తెలిపారు. ఐటీడీఏ సబ్‌ప్లాన్ మండలాల్లో సుమారు 2500ల ఎకరాల్లో కంది పంట సాగవుతుంది. 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఎకరా కంది పంట వేసే రైతుకు ఒక్కో రైతు కుటుంబానికి రూ.10 వేల వరకు ఆదాయం వస్తుందని అంచనా. జీడి, పసుపు వంటి పంటల్లో దీన్ని అంతర పంటగా సాగు చేస్తారు. మూడు నాలుగేళ్లుగా ప్రధాన పంటగానే సాగు చేస్తుండటం విశేషం. ఇటీవల కాలంలో కంది కొత్త పండగలను సైతం పూర్తి చేశారు. మార్కెట్‌లోకి కందికాయలు వచ్చాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో గతంలో 1350 ఎకరాల్లో హైబ్రిడ్ రకం కంది విత్తనాలు సరఫరా చేసింది. ఆ రకం కాస్తా దిగుబడి ఇచ్చింది. వీటిని విత్తనాలుగా కట్టి వాటిని వినియోగించడం జరుగుతుంది.
ఏజెన్సీలో నాణ్యమైన ఆర్గానిక్ పంట
ఎరువులు పెద్దగా వేయకుండా కంది పంటను గిరిజనులు పండిస్తారు. దీంతో ఈ సీజన్‌లో వీటికి డిమాండ్ ఉంటుంది. కొంతమంది గిరిజనులు వారపు సంతలకు పచ్చి కందికాయలను తీసుకువస్తారు. వీటిని వినియోగదారులు కొనుగోలు చేసుకుంటారు. కిలో రూ.100 నుంచి 130 వరకు విక్రయిస్తారు. అలాగే కావుళ్లు, బుట్టలతో కూడా తీసుకువచ్చి అమ్మకాలు చేస్తారు. మరికొందరు ఎండబెట్టి వాటిలో కందులను వేరు చేసి కిలోల వంతును అమ్ముతారు. వీటి ధరలు కూడా కిలో రూ.100 పైనే ఉంటుంది. గతంలో ఐటీడీఏ వెలుగు ఆధ్వర్యంలో కందులను ప్రోసెస్ చేసి మహిళా సంఘాల ద్వారా విక్రయించే వారు. అనతి కాలంలో సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో కొనుగోలు చేయడం మానివేశారు.
Comments
Please login to add a commentAdd a comment