సైబర్‌ నేరగాళ్ల కొత్త వల | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్ల కొత్త వల

Published Fri, Jan 17 2025 12:28 AM | Last Updated on Fri, Jan 17 2025 12:28 AM

సైబర్

సైబర్‌ నేరగాళ్ల కొత్త వల

యువతే లక్ష్యంగా మోసాలు

రకరకాల కాల్స్‌ పేరుతో వివరాల సేకరణ

రూ.వేల నుంచి రూ.లక్షల వరకు దోపిడీ

జిల్లాలో పెరుగుతున్న బాధితులు

జాగ్రత్తలు పాటించాలంటున్న పోలీసులు

పార్వతీపురంటౌన్‌: యువతే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. ఉద్యోగాల పేరిట, బ్యాంకు అకౌంట్‌ ఈకై వైసీ, సిమ్‌కార్డ్‌ డీయాక్టివేషన్‌, ఎలక్ట్రిసిటీ ఈకేవైసీ తదితర అంశాలపై గాలం విసిరి రూ.లక్షల్లో దోచేస్తున్నారు. పార్ట్‌టైం జాబ్‌లంటూ మోసం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికలపై ఆన్‌లైన్‌ నకిలీ ప్రకటనలతో గారడీ చేసి బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది చదువుకున్న వారే. పలు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఇంజినీరింగ్‌ వంటి సాంకేతిక విద్యనభ్యసించిన నిరుద్యోగులు ఎక్కువగా మోసపోతుండడం గమనార్హం. గత ఏడాది 474 మంది బాధితుల నుంచి రూ.2.79 కోట్లు సైబర్‌ నేరగాళ్లు దోచుకోగా పోలీసులు అప్రమత్తమై రూ.46,80,297 స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు.

బయోడేటా సేకరించి కాల్స్‌

ప్రముఖ ఆన్‌లైన్‌ జాబ్‌ సెర్చ్‌ ఇంజిన్లలో ఇచ్చిన బయోడేటా ఆధారంగా నిరుద్యోగుల సమాచారం సేకరించి సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకుని జాబ్‌ కన్సల్టెన్సీ ముసుగులో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారికి మెయిల్స్‌ పంపిస్తారు. అవసరమైతే కాల్‌ చేస్తారు. ఇంటర్వ్యూ పేరుతో మోసం చేస్తారు. రకరకాల ప్రశ్నలు వేసి సమాచారాన్ని రాబడతారు. జాబ్‌ వచ్చేసినట్లేనని నమ్మిస్తారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఫీజులు, యూనిఫాం అడ్వాన్‌న్స్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ వంటి పేర్లతో దోచుకుంటారు.

వర్క్‌ ఫ్రం హోం పేరుతో..

చాలా మంది ఎక్కువగా ఇంటి వద్ద ఉంటూ పనిచేయడానికే ఇష్టపడతారు. జాబ్‌ స్కామ్‌ చేసే వాళ్లు వారినే ఎక్కువగా టార్గెట్‌ చేసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తక్కువ సమయం, తక్కువ శ్రమతోనే నెలకు వేలాది రూపాయలు సంపాదించవచ్చని నమ్మించి నగదు దోచేసి నేరగాళ్లు ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేస్తున్నారు. కొందరైతే డేటా ఎంట్రీ పని ఉందని, ఎక్కువ స్కిల్స్‌ అవసరం లేదని, చాలా ఎక్కువ డబ్బులిస్తామని నమ్మిస్తారు. ముందుగానే ప్రాసెసింగ్‌ ఫీజు, ట్రైనింగ్‌ ఫీజు రూపంలో అడ్వానన్స్‌ పేమెంట్‌ చేయించుకుంటారు. డేటా ఎంట్రీ అనంతరం అందులో తప్పులు ఉన్నాయని, దాని వల్ల సంస్థ నష్టపోయిందని, పరిహారం చెల్లించాలని, లేకుంటే లీగల్‌ ప్రొసీడింగ్స్‌కు వెళ్తామని బెదిరించి అధిక మొత్తంలో తిరిగి డబ్బులు వసూలు చేస్తారు.

సాధారణంగా ప్రముఖ సంస్థలు ఎప్పుడూ రిజిస్ట్రేషన్‌ ఫీజు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ చార్జీలు వసూలు చేయవు

● ప్రకటనల్లోని లోగో లెటర్లను గమనించాలి

● జాబ్‌ స్కామ్‌/ఫ్రాడ్‌ చేసేవారు పంపే మెయిల్స్‌ గమనిస్తే కాస్త తేడాగా ఉంటాయి

● నేరగాళ్లు ఉద్యోగ ప్రకటనల్లో గానీ, ఈ–మెయిల్స్‌లో గానీ ఎక్కువగా గ్రామర్‌ తప్పులు ఉంటాయి. జాబ్‌ డిస్క్రిప్షన్‌ కూడా స్పష్టంగా ఉండదు

● క్విక్‌ మనీ, అన్‌లిమిటెడ్‌ ఎర్నింగ్స్‌, స్కిల్స్‌ అవసరం లేదు అనే పదాలు చూసిన వెంటనే అప్రమత్తం కావాలి

● 1930 సైబర్‌ సెల్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. లేదా మీ పరిధిలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి.

నకిలీలను ఇలా గుర్తించాలి..

సైబర్‌ నేరాల నియంత్రణకు చర్యలు

సైబర్‌ నేరాల నియంత్రణకు చర్యలు చేపడతున్నాం. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చదువుకున్న యువత మోసపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఉద్యోగాలకు డబ్బులివ్వడమేమిటనే ఆలోచన చేయాలి. యువత జాబ్‌ ప్రకటనలకు స్పందించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. పూర్తి సమాచారం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.

–ఎస్‌.వీ.మాధవ్‌ రెడ్డి, ఎస్పీ, పార్వతీపురం మన్యం

No comments yet. Be the first to comment!
Add a comment
సైబర్‌ నేరగాళ్ల కొత్త వల1
1/1

సైబర్‌ నేరగాళ్ల కొత్త వల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement