పింఛన్ పథకం..వేతనజీవులకు వరం
సద్వినియోగం చేసుకోవాలి..
అసంఘటిత రంగ కార్మి కులకు ఎంతో భరోసాగా ఉండే ఈ పథకాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలి. అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నాం. ఆదాయపు పన్ను చెల్లించని వారే ఈ పథకానికి అర్హులు. కార్మికులు ఈ పథకానికి దరఖాస్తుచేసుకుని సద్వినియోగం చేసుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే కార్మికశాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
బి.కొండలరావు, లేబర్ ఆఫీసర్, రాజాం
● 60 ఏళ్ల తరువాత పింఛన్ పొందే అవకాశం
● నమోదుచేసుకోవాలంటున్న అధికారులు
● రూ.15వేల లోపు వేతనదారులంతా అర్హులే
రాజాం సిటీ: ఉద్యోగ విరమణ అనంతరం ప్రతి నెల పింఛన్ పొందే అవకాశం ఉద్యోగులకు ఉంటుంది. అదే రెక్కాడితేగాని డొక్కాడని కార్మికులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందే అవకాశం లేదు. అందులో అసంఘటిత కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు కష్టపడి పనిచేసుకుంటూ జీవితాన్ని నెట్టుకువస్తున్న వారికి వయసు పెరిగేకొద్దీ ఓపిక నశించడంతోపాటు ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇక వృద్ధాప్యంలో చేతిలో రూపాయిలేక అనేక అవస్థలు పడుతుంటారు. అలాంటి అసంఘటిత రంగ కార్మికులకు కేంద్రప్రభుత్వం అండగా నిలుస్తోంది. మలి సంధ్యలో పింఛన్ రూపంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పేరిట 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 3వేలు చొప్పున ఏడాదికి రూ.36వేలు అందించనుంది.
కనిష్టంగా రూ.55..
18 నుంచి 40 ఏళ్లలోపు అసంఘటిత రంగ కార్మికులు వయసు ఆధారంగా నెలకు రూ.55 నుంచి గరిష్టంగా రూ.200 చెల్లించాలి. కేంద్రప్రభుత్వం అంతే మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తుంది. కార్మికుడికి 60 ఏళ్లు నిండిన తరువాత నెలకు రూ.3వేలు చొప్పున కేంద్రప్రభుత్వం పింఛన్ ఇస్తుంది. లబ్ధిదారుడి మరణానంతరం జీవిత భాగస్వామికి 50 శాతం పింఛన్ వస్తుంది. పథకంలో చేరిన కొన్నాళ్లకు వైదొలగాలనిపిస్తే పొదుపు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు. పథకంలో కొనసాగుతున్న సమయంలో మరణిస్తే వారి నామినీ సభ్యులుగా కొనసాగి ఆపైన పింఛన్ అందుకోవచ్చు.
కొరవడిన అవగాహన..
ఈ ఏడాది ప్రారంభంలో ఈ పథకం ప్రవేశపెట్టినా ఎన్నికలు రావడంతో ఈ పథకంపై అంతగా ప్రచారం నిర్వహించలేదు. అయితే ఈ పథకం ప్రారంభమైన విషయాన్ని కూడా అధికారులు తెలియపర్చకపోవడం శోచనీయం. దీంతో నష్టపోవాల్సి వస్తోందని పలువురు కార్మికులు వాపోతున్నారు. ఈ పథకం ఉందనే విషయం కూడా తమకు ఇంతవరకు తెలియదంటూ రాజాంలో పనికి వచ్చిన కూలీలు రామారావు, శ్రీనివాసరావు, రామినాయుడు తదితరులు వాపోతున్నారు. అధికారులు స్పందించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు.
దరఖాస్తు ఇలా చేసుకోవాలి..
సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవా కార్యాలయాల్లో ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ మొదటి పేజీ జిరాక్స్‌లు, మొబైల్ నంబర్ వివరాలు అందించి ఈ పథకంలో చేరవచ్చు. లబ్ధిదారులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు 60 సంవత్సరాల వయసు వచ్చేవరకు చెల్లించాల్సి ఉంటుంది. 61వ సంవత్సరం నుంచి నెలకు రూ. 3వేలు చొప్పున పింఛన్ అందుకునే వీలుంటుంది.
వీరు అర్హులు...
నెలకు రూ.15వేల లోపు జీతం పొందే వారంతా అసంఘటిత కార్మికులే. వారిలో వ్యవసాయ కూలీలు, పాడి పరిశ్రమ, రోల్డ్‌గోల్డ్ కార్మికులు, మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులు, చేనేత, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకారులు, క్షౌ రవృత్తి, బ్యూటీపార్లర్, చర్మకారులు, రజకులు, కలంకారీ, తోపుడుబండి, చిరు వ్యాపారులు, మెకానిక్ తదితర వర్గాలకు చెందిన వారు అర్హులు. అలాగే టైలర్లు, రిక్షా కార్మికులు, కళాకారులు, ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లో పనిచేసే స్వీపర్లు, కొరియర్ బాయ్స్, ముఠాకార్మికులు, డ్వాక్రా, ఆశ, విద్యావలంటీర్లు, అంగన్వాడీ, మెప్మా మహిళలు, డ్రైవర్లు, క్లీనర్లు, హోటల్స్, సినిమాహాల్స్, ప్రైవేట్ పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది, ప్రైవేట్ ఆస్పత్రిలో సహాయకులు ఈ పథకంలో చేరవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment