పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికే వెల్పేర్ డే
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్‌అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికే పోలీస్ వెల్ఫేర్‌డేను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. సిబ్బంది విజ్ఞాపనలు పరిశీలించిన ఎస్పీ, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. పోలీసు సిబ్బంది తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను ఎస్పీ స్వయంగా నోట్ చేసుకుని, వాటి పూర్వాపరాలు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.
సర్వశిక్ష ఏపీసీగా
రామారావు నియమకం
విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖకు సంబంధించి సర్వశిక్ష విభాగానికి అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ (ఏపీసీ)గా డాక్టర్ ఎ.రామారావును విద్యాశాఖ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన వివిధ జిల్లాల సర్వశిక్ష ఏపీసీల నియమకాల జాబితాలో వెల్లడించింది. దాదాపు రెండేళ్లుగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇటీవల రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ జిల్లాల ఏపీసీల నియామకాల ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. రామారావు ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని హార్టికల్చర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
ఘనంగా సాహితీవేత్త చాసో జయంతి
విజయనగరం అర్బన్: సాహితీవేత్త చాగంటి సోమయాజులు (చాసో) జయింతిని స్థానిక కుసుమగజపతినగర్‌లో జిల్లా గ్రంథాలయ సేవా సంఘం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. తొలుత ఆమన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాసో రచనలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని కొనియాడారు. ఆయన రచనలు హిందీ, కన్నడ, మరాఠి, మళయాళం, ఉర్దూ భాషల్లో చేసిన అనువాదాలు ప్రాచుర్యం పొందాయన్నారు. జిల్లా గ్రంథాలయ సేవా సంఘం వ్యవస్థాపకుడు అబ్దుల్ రవూఫ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఎస్‌రాజు, సీహెచ్.సాయిరెడ్డి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వివాహిత ఆత్మహత్య
పాచిపెంట: మండల కేంద్రంలోని సాలాపువీధికి చెందిన వివాహిత సుంకరి నీలిమ(34) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వెంకటసురేష్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ, నీలిమ గురువారం రాత్రి తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుందని చెప్పారు. మృతురాలి తల్లి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నీలిమకు భర్త వెంకటరావుకు మధ్య తరచూ తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో భర్త నుంచి ఆమె రెండేళ్ల క్రితం విడిపోయి రాయగడ వెళ్లిపోయింది. పెద్దలు రాజీ కుదర్చడంతో ఇటీవల రెండు నెలల క్రితం మళ్లీ భర్త వద్దకు వచ్చిందని ఎస్సై వివరించారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
ఈఎంటీ దహన సంస్కరణలకు రూ.10 వేల ఆర్థిక సాయం
విజయనగరం ఫోర్ట్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఈఎంటీ రాంబాబు దహన సంస్కరణలకు 108 ఉద్యోగుల సంఘం తరఫున రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. బాడంగి 108 అంబులెన్సులో ఈఎంటీగా పనిచేస్తున్న లోలుగు రాంబాబు, అతని భార్య, ఇద్దరు కుమారులతో కలిసి జియ్యమ్మవలస మండలంలోని అల్లువాడ నుంచి రామభద్రపురం వస్తుండగా పార్వతీపురం మండలం నర్సిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంబాబు, అతని కుమారుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. శుక్రవారం రాంబాబు కుటుంబసభ్యులను 108 జోనల్ మేనేజర్ నజీర్ హుస్సేన్ మన్యం జిల్లా మేనేజర్ మన్మథనాయుడు, 108 ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా గౌరవ అధ్యక్షుడు బంగారురాజు, మన్యం జిల్లా అధ్యక్షుడు గొర్ల అప్పలనాయుడు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు వేమలి అప్పలనాయుడు పరామర్శించి దహన సంస్కరణలకు ఆర్థిక సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment