హామీలు నిలబెట్టుకోకుంటే ఉద్యమానికి సిద్ధం
● ఎస్‌టీయూ జిల్లా కమిటీ
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్‌టీయూ జిల్లా కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు స్థానిక అమర్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 2024 సాధారణ ఎన్నికల ప్రచార సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నిలబెట్టుకోకుంటే ఉద్యమిస్తామని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు మినహా మరి ఏ ఇతర ఆర్థికపరమైన లబ్ధిపొందలేదని సరెండర్ లీవులు, డీఏ అరియర్స్, పీఆర్‌సీ బకాయిలు, రెండు సంవత్సరాల నుంచి ఏపీజీఎల్‌ఐ పాలసీలు మెచ్యూర్ అయినప్పటికీ వాటి చెల్లింపులు మరిచారని ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.32 వేల కోట్లు ఉండగా ఈ సంక్రాంతికి కేవలం 10 శాతం మాత్రమే చెల్లించారని మిగిలిన 90 శాతం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
తక్షణమే పదోన్నతులు చేపట్టాలి
12వ వేతన సవరణ సంఘానికి సంబంధించిన కమిషన్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికీ మొదలు పెట్టలేదని వ్యాఖ్యానించారు. మధ్యంతర భృతి 30 శాతానికి ప్రకటించకపోతే భావసారుప్య సంఘాలలో కలిసి ఉద్యమిస్తామని యాప్‌ల భారం తగ్గించాలని తక్షణమే పదోన్నతులు చేపట్టి బదిలీలకు సంబంధించి 8 అకడమిక్ సంవత్సరాల కాలపరిమితి మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. సంఘం అధ్యక్షుడు కె.జోగారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిప్పాడ సూరిబాబు, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.మురళి, జిల్లా ఆర్థిక కార్యదర్శి బి.ఈశ్వరరావు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి పి.రాంబాబు, కార్యదర్శులు టి.నాగేశ్వరరావు, పి.వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment