భాగస్వామ్యంతోనే స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం: ప్రజలు, సిబ్బంది భాగస్వామ్యంతోనే స్వచ్ఛఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమం విజయవంతం అవుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించ నున్నామన్నారు. కార్యక్రమానికి సంబంధించి విధివిధానాలను, మార్గదర్శకాలను విడుదల చేశామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, పురపాలకశాఖలు ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించాలని సూచించారు. చెత్త కుప్పల తొలగింపు, తాగునీటి వసతులు, క్లోరినేషన్, మురుగు కాలువలు శుభ్రం చేయడం, సామాజిక మరుగుదొడ్లను గుర్తించడం, ఉపయోగంలోకి తీసుకురావడం, దోమల నివారణకు చర్యలు చేపట్టడం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో చెరువులను అభివృద్ధి చేయడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు తదితర పనులు చేయాల్సి ఉందన్నారు. ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఒక థీమ్‌తో కార్యక్రమాన్ని చేపట్టనున్నామని వివరించారు. కార్యక్రమంలో డీపీఓ టి.కొండలరావు, డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారి బి.రామ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment