మారిక రోడ్డు పూర్తి చేయాలి
ఉగాది నాటికి..
● కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్
● రహదారి నిర్మాణానికి రూ.7కోట్లు మంజూరు
● హర్షం వ్యక్తం చేసిన మారిక గిరిజనులు
● రోడ్డు నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని వినతి
కలెక్టర్‌కు కృతజ్ఞతలు
గిరిజనులకు డోలీ మోతలకు స్వస్తి చెప్పాలన్న లక్ష్యంతో కలెక్టర్ ఎస్.కోట నియోజకవర్గంలో మారిక రోడ్డుకు రూ.ఏడుకోట్లు, రేగ పుణ్యగిరి రోడ్డుకు నిధులు మంజూరు చేయడంపై స్థానిక నేతలతో పాటు గిరిజనులు హర్షం వ్యక్తంచేశారు. రోడ్డు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేసి రాకపోకల కష్టాలు తొలగించాలని కలెక్టర్‌కు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు సమష్టి బాధ్యతతో సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ వేచలపు వెంకట చినరామునాయుడు, పలువురు కూటమినేతలు, స్థానికులు, గిరిజనులు, నోడల్ అధికారి లక్ష్మీనారాయణ, తహసీల్దార్ రాములమ్మ, ఎంపీడీఓ సూర్యనారాయణ తదితర జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
వేపాడ: దశాబ్దాల కాలంగా నెరవేరని మారిక గ్రామ గిరిజనుల సమస్యను రెండు నెలల్లో పరిష్కరించి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ అన్నారు. ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి శుక్రవారం కరకవలస పంచాయతీ శివారు గిరిశిఖరంపై నివసిస్తున్న మారిక రహదారి నిర్మాణాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రాధాన్యంను ఎంపీపీ సత్యవంతుడు, జెడ్పీటీసీ ఎస్.అప్పారావు, సర్పంచ్ పాతబోయిన పెంటమ్మ, మండలస్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోడ్డు నిర్మాణం నిధులపై ఆరాతీశారు. గతంలో ప్రధాన మంత్రి గ్రామసడక్ యోజన పథకంలో నిధులు మంజూరు కాగా 2 కి.మీ మేర తారురోడ్డు, కల్వర్టు పూర్తి కాగా మరో 4కి.మీ నిర్మాణానికి నిధులు ఉన్నట్లు రెండునెలల్లో రోడ్డునిర్మాణం పూర్తి చేస్తామని కలెక్టర్‌కు పీఆర్ ఎస్‌ఈ వివరించారు. అటవీ శాఖ అనుమతులూ ఉన్నాయని చెప్పారు.
ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లాజగన్ నిధుల మంజూరు చాలక రోడ్డు పనులు నిలిచిపోవడం, గిరిజనుల సమస్యలను, విద్యవైద్యం, రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి వారు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. దీంతో కలెక్టర్ స్పందించి మిగిలిన 5 కి.మీ.మేర రోడ్డు నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.ఏడు కోట్లు మంజూరు చేస్తామని ఉగాది నాటికి రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. దీంతో గిరిజనులు, గిరిజన సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గిరిజనులతో పాటు కొంత దూరం కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు నడిచివెళ్లారు.
రేగ పుణ్యగిరికి కలెక్టర్ హామీలు
శృంగవరపుకోట: గిరిజనుల డోలీ కష్టాలకు చెక్ పెట్టాలని కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎస్.కోటలో పుణ్యగిరి గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే లలితకుమారితో కలిసి వచ్చి పుణ్యగిరి వద్ద రేగపుణ్యగిరికి రోడ్డు వేయాల్సిన స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేగపుణ్యగిరి వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ రేగపుణ్యగిరి వాసులకు డోలీ కష్టాలు లేకుండా చూడాలని, తాగునీరు, పోడు పట్టాలు, ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అంబేడ్కర్‌ను కోరారు. గ్రామస్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ తక్షణం ఉపాధి హామీ పథకంలో రూ.2కోట్లతో రేగపుణ్యగిరికి గ్రావెల్ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఉగాది నాటికి రేగపుణ్యగిరికి రోడ్డు, తాగునీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్, అటవీశాఖల అధికా రులు సమన్వయంతో పనిచేసి రోడ్డు పని జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రామంలో సర్వే చేసి పోడుపట్టాలు, పింఛన్లు, ఇళ్లు సమస్యలపై తనకు నివేదిక ఇవ్వాలని, ఆయా శాఖల ఉద్యోగులను ఆదేశించారు.
తడబడిన రెవెన్యూ ఉద్యోగులు
కలెక్టర్ అడిగిన ఒక్క ప్రశ్నకూ సరైన జవాబు చెప్పలేక రెవెన్యూ ఉద్యోగులు అవస్థలు పడ్డారు. రేగపుణ్యగిరిలో ఎంతమంది గిరిజనులకు పోడు పట్టాలిచ్చారు? ఎంత భూమి ఇచ్చారు ? ఎంత మంది అనుభవిస్తున్నారు? పట్టాలు లేకుండా ఎంతమంది ఎంత భూమి అనుభవిస్తున్నారు ? 42 కుటుంబాలు ఉంటే 47 రేషన్ కార్డులు ఎలా నడుస్తున్నాయి. దొంగ కార్డులు ఉన్నాయా ? 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 527 అని నాకు రిపోర్ట్ ఇచ్చారు. రేగ పుణ్యగిరి జనాభా 127 అయితే ఇంత ఎందుకు చూపిస్తున్నారు. ఇక్కడి వీఆర్వో ఎవరు క్లారిటీ ఇవ్వండంటూ ప్రశ్నించినా రెవెన్యూ ఉద్యోగులు సరైన బదులివ్వలేదు. కలెక్టర్ వస్తారని రెండరోజుల ముందే తెలిసినా సరైన సమాచారంతో రెవెన్యూ సిబ్బంది సిద్ధం కావపోవడం శోచనీయం. కార్యక్రమంలో ఆర్డీవో డి.కీర్తి, డ్వామా పీడీ ఎస్.శారదాదేవి, పీఆర్ ఎస్‌ఈ ఎం.శ్రీనివాసరావు, తహసీల్దార్ అరుణకుమారి, ఎంపీడీఓ సతీష్, ఆర్‌డబ్ల్యూఎస్, హెల్త్, హౌసింగ్, ఫారెస్ట్ తదితర శాఖల ఉద్యోగులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment