No Headline
● గతంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం అందేది. ఏఐబీపీ పథకం కింద తోటపల్లి ప్రాజెక్టుకు రూ.వందల కోట్లు కేటాయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఈసారైనా తోటపల్లి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సాయం అందుతుందా? అని జిల్లావాసులు ఆశగా ఎదురుచూశారు. తోటపల్లి మిగులు పనులు, నిర్వహణ, భూసేకరణ, కాలువల నిర్మాణం వంటి వాటికి రూ.700 కోట్ల వరకు అవసరమవుతుందని అంచనా. రాష్ట్ర బడ్జెట్‌లోనూ కూటమి ప్రభుత్వం రూ.33 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొంది. కేంద్రం కూడా మొండిచేయి చూపింది. వ్యవసాయానికి కూడా పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు.
● పత్తి ఉత్పత్తికి ఐదేళ్లలో చేయూత అందిస్తామని కేంద్రం ప్రకటించింది. జిల్లాకు వచ్చేసరికి కొనుగోలు కేంద్రాలు అంతంత మాత్రమే కావడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ఈ దఫా 14,800 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. కొనుగోలులో సీసీఐ తీవ్ర నిర్లక్ష్యం చూపడం వల్ల మద్దతు ధర కూడా రైతులు పొందలేకపోయారు.
● గుణుపూర్ నుంచి మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాచిపెంట మీదుగా అరకు వెళ్లే రైలు మార్గం వేయాలన్న ప్రతిపాదన ఉంది. దీని కోసం ఎటువంటి అడుగులూ పడలేదు. కనీసం సర్వేకు కూడా నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు.
● గిరిజన యూనివర్సిటీకి ఏటా అరకొర కేటాయింపులే జరుగుతున్నాయి. ఈసారి కూడా సరైన హామీ ఇవ్వలేదు. నిధులు లేక పనులు నత్తనడకన సాగుతున్నాయి. సరైన భవనాలు లేక తరగుతులు కూడా పరాయి పంచన నిర్వహించాల్సి వస్తోంది. విశ్వవిద్యాలయానికి సంబంధించి 2019 నుంచి తరగతులు జరుగుతున్నాయి. సుమారు 400 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. మరడాం–మెంటాడ మండలం కుంటినవలస గ్రామాల పరిధిలో 560 ఎకరాలను వర్సిటీకి కేటాయించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశ్వ విద్యాలయాన్ని ఈ క్యాంపస్ నుంచే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2027 నాటికి పూర్తిస్థాయిలో భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. నిధులపై స్పష్టత లేకపోవడంతో పనులు ఎంత వరకు ముందుకు కదులుతాయన్నది సందిగ్ధమే.
● ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వలసలు అధికం. ఉపాధిహామీ పనులు గిట్టుబాటు కాక.. ఏటా లక్షమందికిపైగా పనుల కోసం విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఉపాధిహామీ పథకానికి ఈ సారీ పెద్ద ఎత్తున కేటాయింపులు లేకపోవడం వలసల ప్రాంతమైన పార్వతీపురానికి పెద్ద దెబ్బే అని ప్రజాసంఘాల నాయకులు పెదవి విరుస్తున్నానరు. జిల్లాలోని 450 పంచాయతీల పరిధిలో 2.09 లక్షల జాబ్‌కార్డులున్నాయి. సుమారు 3.96 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. పెద్ద ఎత్తున పనులు కల్పిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకుంటున్నప్పటికీ.. అధిక శాతం మందికి వంద రోజులు పని దినాలు కల్పించడం లేదు. సగటు వేతనం కూడా రూ.200 లోపే అందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment