నర్సింగ్ తరగతులకు సన్నద్ధం
● మొత్తం సీట్లు 60.. సుముఖత వ్యక్తం చేసింది 54 మంది ● ఖాళీ సీట్ల భర్తీకి నేటినుంచి వెబ్ కౌన్సెలింగ్
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)తోపాటు సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)కు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం రామగుండం ప్రభుత్వ మహిళా నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఈఏడాది డిసెంబర్ మొదటి వారం నుంచే తరగతులు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపడుతున్నారు. సిమ్స్ కాలేజీ, జీజీహెచ్‌కి సమీపంలోనే నర్సింగ్ కాలేజీ నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు.
ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ నియామకం..
● జగిత్యాల నర్సింగ్ కాలేజీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసూనను రామగుండం నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, సిరిసిల్ల నర్సింగ్ కాలేజీ ఫ్యాకల్టీ సుశీలను రామగుండం వైస్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. మిగతా ఫ్యాకల్టీలతోపాటు సిబ్బందిని నియమించాల్సి ఉంది. జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తూ, ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తిచేసిన నర్సింగ్ ఆఫీసర్లను రామగుండం నర్సింగ్ కాలేజీకి పదోన్నతిపై ఫ్యాకల్టీలుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రూ.26కోట్లు మంజూరు..
● రామగుండం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ కోసం ప్రభుత్వం రూ.26 కోట్లు మంజూరు చేస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. ఈ నిధులతో కాలేజీ కోసం కొత్త భవన నిర్మాణంతోపాటు ఫర్నీచర్ తదితర సామగ్రిని సమకూర్చే బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్(టీజీ ఎంఎస్‌ఐడీసీ)కి అప్పగించారు.
కేటాయించిన 60 సీట్లు..
● కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగే రామగుండం నర్సింగ్ కాలేజీకి 60 సీట్లు కేటాయించారు. మొదటి సంవత్సరంలో చేరడానికి 55 మంది విద్యార్థినులు ఇప్పటికే రామగుండం కాలేజీని ఎంచుకోగా, ఒకరు మినహా 54 మంది ప్రవేశాలకు సుముఖుత వ్యక్తం చేస్తూ రిపోర్టు చేశారు. ఆదివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నచ్చిన నర్సింగ్ కాలేజీని ఎంచుకోవడానికి మరోసారి అవకాశం కల్పించారు. దీంతో మిగిలిన సీట్లు కూడా భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
స్థలం కోసం పరిశీలన..
● నర్సింగ్ కాలేజీ నిర్వహణకు అవసరమైన స్థలం కోసం స్థానిక ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్షతోపాటు అధికారులు అన్వేషణ ప్రారంభించారు. కాలేజీకి సుమారు ఐదెకరాలు అవసరం ఉంటుందని భావిస్తున్నారని తెలిసింది. ఇందుకోసం సిమ్స్ సమీపంలోని సింగరేణి స్థలం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్థలం ఇవ్వడానికి సింగరేణి అధికారులు ముందుకురాకపోతే.. సమీపంలోనే మరో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేలా ప్రణాళిక తయారు చేస్తున్నారని సమాచారం.
ఒకేచోట తరగతులు.. హాస్టల్..
● భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకూ గోదావరిఖని శారదానగర్‌లో సిమ్స్ కాలేజీ విద్యార్థుల హాస్టల్ కోసం ఉపయోగించిన సింగరేణి భవనాన్ని తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు ఉపయోగించడానికి చర్యలు చేపట్టారు. ఈ భవనంలోనే గ్రౌండ్ ఫ్లోర్‌లో క్లాసు రూమ్‌లు, పైఅంతస్తులో హాస్టల్ కోసం ప్రత్యేకంగా గదులను కేటాయించారు. ఒక్కో గదిలో ఆరు బెడ్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాష్‌రూమ్, సాన్నాల గదులు, తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు, శానిటేషన్ తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు.
స్థల పరిశీలన చేస్తున్నాం
రామగుండంలో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటు శుభపరిణామం. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి అనుకూలమైన స్థల పరిశీలన చేస్తున్నాం. సిమ్స్ సమీపంలోనే సింగరేణి స్థలాన్ని కేటాయించేలా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. ఇది ఇవ్వకుంటే మరో స్థలం కోసం అన్వేషిస్తాం.
– మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే
తరగతుల నిర్వహణపై దృష్టి
నర్సింగ్ కాలేజీలో ఫస్టియర్ బోధన తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. నర్సింగ్ గర్ల్స్ కాలేజీకి 60 సీట్లు కేటాయించగా 55 మంది చేరడానికి ముందుకు వచ్చారు. ఒకరు తప్ప అందరూ రిపోర్టు చేశారు. ఆదివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
– ప్రసూన, ప్రిన్సిపాల్, నర్సింగ్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment