మోకీలు మార్పిడి సర్జరీ విజయవంతంగా నిర్వహించిన వైద్యులు బృందం
క్లిష్ట సమస్యలను సవాల్‌గా స్వీకరిస్తున్న వైద్యులు
అత్యాధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు, ఆధునిక వైద్య సేవలు
జీజీహెచ్‌లో పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఘనత
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) కాలేజీకి అనుబంధంగా స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అత్యంత క్లిష్టమైన వైద్యచికిత్సలు, శస్త్రచికిత్సలు చేయడంలో డాక్టర్లు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. వివిధ కారణాలతో ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న పేషెంట్లకూ వైద్యం చేస్తూ పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించినా అందని వైద్యసేవలు జీజీహెచ్‌లో ఉచితంగానే అందుబాటులోకి రావడం, వైద్యులు కూడా ఎంతోసహనం, ఓర్పుతో సేవలు అందించడంతో పేదల్లో సర్కారు వైద్యంపై భరోసా పెరుగుతోంది.
ఒరోఫేషియల్ సర్జరీ విజయవంతం
ప్రమాదానికి గురైన ఓ పేషెంట్‌కు జీజీహెచ్ వైద్యు లు తొలిసారి మారథాన్ ఒరోఫేషియల్ ట్రామా సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. రోడ్డు ప్ర మాదంలో ముఖంపై ఆరుచోట్ల పగిలిన ఓ పేషెంట్ కు హైబీపీ ఉన్నా వైద్యులు రిస్క్ తీసుకుని శస్త్రచికి త్స చేశారు. ఆరుచోట్ల మినీప్లేట్ ఇంప్లాంట్లు, మరో 20 స్క్రూల ప్లేస్‌మెంట్‌తో పగుళ్లను చక్కదిద్దారు.
మోకీలు మార్పిడి సేవలు..
జీజీహెచ్‌లో ఆర్థోశస్త్ర చికిత్సలు మెరుగ్గు అందుతున్నాయి. ఇందులో ప్రధానంగా మోకీలు మార్పిడి ఆపరేషన్లు సక్సెస్ కావడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వృద్ధురా లు రామిండ్ల లింగమ్మకు మోకీలు మార్పిడి శస్త్రచికిత్స చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
గత అక్టోబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖనికి చెందిన జంగ సంజయ్ ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. జీజీహెచ్‌లో అడ్మిట్ కావడంతో అనెస్తీషియా సాయంతో వైద్యులు రంగంలోకి దిగారు. అత్యంత కఠినమైన, ఆధునిక పద్ధతిన శస్త్రచికిత్స చేయడంతో బాధితుడు కోలుకున్నాడు. ఇలాంటి ఆర్బిటాల్ ఏస్ప్లోరేషన్ – ఆర్బిటాల్ ఫ్రాక్చర్ శస్త్రచికిత్సలు ఇప్పటివరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలోనే చేస్తున్నారు. తొలిసారి గోదావరిఖని గవర్నమెంట్ జనరల్(జీజీహెచ్) ఆస్పత్రిలో నిర్వహించడం విశేషం.
నా కొడుకును బతికించారు
నా కొడుకుపై కుక్కలు దాడిచేయడంతో తలపై చర్మం ఊడిపోయింది. పరిస్థితి చూసి బతకడు కున్న. జీజీహెచ్ డాక్టర్లు దేవుళ్లు. కేసును చాలెంజ్‌గా తీసుకొని ఆపరేషన్ చేసి బతికించారు.
– సయ్యద్ అమీర్‌పాషా, రామగుండం
మా వైద్యుల కృషి బాగుంది
పీడియాట్రిషిన్ టీం సాయంతో చాలా రిస్క్ కేసులను చాలెంజ్‌గా తీసుకొని శిశువులకు వైద్యసేవలు అందిస్తూ బతికిస్తున్నాం. 600 గ్రాముల బరువున్న ఓ శిశువు బతికే అవకాశం లేకున్నా.. మా బృందం సాయంతో బతికించాం. కొన ఊపిరితో ఉన్న మరో శిశువును మూడురోజులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేయి ప్రాణాలు పోశాం.
– ఆదిశ్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణుడు–జీజీహెచ్
ఆరో తరగతి చదివే ఈ బాలిక పేరు ఉడుత వైష్ణవి. మంథని మండలం నాగారం. తల్లిదండ్రులు మహేశ్వరి – సంతోష్, వ్యవసాయ కూలీలు. గత ఆగస్టు 24న అరుగుపై నిద్రిస్తున్న వైష్ణవిని పాము కాటేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వెంటిలేటర్‌పై ఉన్న తమ కూతురు ఇక బతకదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పిల్లల వైద్య నిపుణులు ఆదిశ్‌రెడ్డి, రాజీవ్, ఎ.శిరీష, కె.శిరీష కేసును సవాల్‌గా తీసుకుని వైద్య చికిత్స ప్రారంభించారు. గంటగంటకూ బాలిక ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తూ రెండు రోజులపాటు రాత్రింబవళ్లు శ్రమించారు. వారి శ్రమకు ఫలితం దక్కింది. మూడు రోజుల తర్వాత పాప ఆరోగ్యం కుదుటపడింది. తల్లిదండ్రులేకాదు.. డాక్టర్లు సైతం ఊపిరి పీల్చుకున్నారు.
రామగుండం మసీదు ప్రాంతానికి చెందిన సయ్యద్ ఐమాన్(31 నెలలు) ఈఏదాడి అక్టోబరు 30న ఇంటిముందు ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. తలపై చర్మం ఊడిపోయింది. రక్తం మడుగులో కొట్టుకుంటున్న బాలుడిని తండ్రి సయ్యద్ అమీర్‌పాషా వెంట నే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో స్పందించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.
క్లిష్టమైన కేసులకూ సేవలు
జీజీహెచ్ సూపరింటెండెంట్, సిమ్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో తుంటి ఎముకలు, మోకీలు మార్పిడి తదితర శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ప్రజలు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్, జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment