ఆన్‌లైన్‌లోనే నర్సింగ్ క్లాసులు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనికి మంజూరై న ప్రభుత్వ మహిళా నర్సింగ్ కాలేజీని సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 2న వర్చువల్ పద్ధతిన ప్రారంభించా రు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేక హాస్టల్, క్లాసుల నిర్వహణకు ఆలస్యమవుతోంది. ఐదు రోజులుగా నర్సింగ్ ఆఫీసర్లతోనే ఆన్‌లైన్ విధానంలో విద్యార్థి నులకు పాఠాలు చెప్పిస్తున్నారు. విద్యార్థులు తమ ఇళ్ల దగ్గర ఉండే ఆన్‌లైన్‌లో క్లాసులకు హాజరవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓరియంటేషన్ క్లాసుల ద్వారా నర్సింగ్ ఫ్యాకల్టీలు తొలి సెమిస్టర్‌లోని అంశాలను బోధిస్తున్నారు. ప్రిన్సిపాల్ ప్రసూన, వైస్ ప్రిన్సిపాల్ సుశీల బోధన తీరును పర్యవేక్షిస్తున్నారు. ఇదేసమయంలో కాలేజీకి అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు.
నర్సింగ్ ఆఫీసర్లతో తరగతులు..
● గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో విధులు నిర్వహిస్తున్న ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తిచేసిన ఆరుగురు నర్సింగ్ ఆఫీసర్లతో విద్యార్థినులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేయిస్తున్నారు. వారితోపాటు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కూడా పాఠాలు చెబుతున్నారు. గోదావరిఖని నర్సింగ్ కాలేజీలో చేరిన 58 మందిలో పెద్దపల్లి జిల్లాతోపాటు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మంచిర్యాల, నిర్మల్, బాసర తదితర ప్రాంతాలకు చెందిన వారూ ఉన్నారు. వీరందరికీ కాలేజీతోపాటు వసతి, సౌకర్యాలు కల్పించాల్సిన పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నా యని ఆరోపణలు వస్తున్నాయి.
కొలిక్కిరాని స్థలసేకరణ..
● నర్సింగ్ కాలేజీ కోసం కొత్త భవన నిర్మాణంతోపాటు అవసరమైన ఫర్నీచర్ సమకూర్చడానికి రూ.26 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. కాగా, కాలేజీ నిర్వహణ కోసం మాత్రం ఇప్పటి వరకు బడ్జెట్ విడుదల కాలేదని తెలిసింది. మరోవైపు.. అనుకూలమైన స్థలం కోసం అధికారులు పరిశీలన చేస్తున్నారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని మాతంగి కాంప్లెక్స్ ఎదుట గల ఖాళీ స్థలాన్ని ఇటీవల పలువురు అధికారులు పరిశీలించారు. కానీ స్థలసేకరణపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.
పూర్తికాని తాత్కాలిక ఏర్పాట్లు..
● కాలేజీతోపాటు హాస్టల్ నిర్వణకు పక్కా భవనం లేకపోవడంతో గోదావరిఖని శారదానగర్‌లోని సింగరేణికి చెందిన ఒక భవనాన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు. అవసరమైన ఫర్నీచర్ భవనంలోని గదుల్లో ఏర్పాటు చేసినా.. పూర్తిస్థాయిలో సౌకర్యాలు సమకూర్చే పనులు ఇంకాపూర్తి కాలేదు. దీంతో హాస్టల్, క్లాసుల నిర్వహణకు ఆలస్యమవుతోంది. తొలిసెమిస్టర్ సిలబస్ సకాలంలో పూర్తిచేయాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌లో విద్యార్థినులకు విద్యాబోధన చేస్తున్నారు.
పూర్తికాని ఉద్యోగుల నియామకం..
● గోదావరిఖని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఉద్యోగుల నియామక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. జగిత్యాల నర్సింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ప్రసూనను నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, సిరిసిల్ల నర్సింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేసిన సుశీలను వైస్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. మిగతా ఫ్యాకల్టీలతోపాటు అవసరమైన పూర్తిస్థాయి కార్యాలయ, సెక్యూరిటీ సిబ్బందిని నియమించలేదు. ఇందుకు సంబంధించిన జీవో ఇప్పటివరకు కూడా విడుదల కాలేదు.
తాత్కాలిక భవనంలో అందుబాటులోకి రాని సౌకర్యాలు
కాలేజీ నిర్వహణకు ఇంకా విడుదలకాని నిధులు
గోదావరిఖని ప్రభుత్వ మహిళా నర్సింగ్ కాలేజీ పరిస్థితి
Comments
Please login to add a commentAdd a comment