పీల్చేది రోగాలే..
సాక్షి, పెద్దపల్లి:
వాయు కాలుష్యం పెనుముప్పుగా పరిణమిస్తోంది. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతోంది. దుమ్ము, ధూళి కణాలు పెరగడంతో రామగుండం, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో గాలిలో నాణ్యతా ప్రమాణాలు పడిపోతుండడం, పెరుగుతున్న కాలుష్యంతో భవిష్యత్‌లో ఢిల్లీ తరహా పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలంతో పోలిస్తే శీతాకాలంలో చాలా తక్కువ ఉప్ణోగ్రతలు, తక్కువ గాలి వేగం కారణంగా పరిసరాల్లో వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉంటుంది.
రెండు చోట్లే నమోదు కేంద్రాలు..
టీపీసీబీ ఆధ్వర్యంలో గోదావరిఖని, కరీంనగర్‌లో మాత్రమే కాలుష్య నమోదు కేంద్రాలున్నాయి. సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తారు. వాయు కాలుష్యాన్ని లెక్కించే యంత్రాలు తక్కువగా ఉండటంతో కచ్చితమైన సమాచారం రావడం లేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 2 కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వాయు కాలుష్యం క్రమేణా పెరుగుతోంది. థర్మల్ ప్లాంట్స్, ఓపెన్‌కా స్టులు, పరిశ్రమలు, కాలం చెల్లిన వాహనాలు, మట్టి రోడ్లు, డంపింగ్‌యార్డుల్లో చెత్తను కాల్చడం నుంచి వచ్చే దుమ్ము ఇందుకు కారణం.
100–200 మధ్య ఉంటే ప్రమాదం..
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 0–50 కేటగి రీలో ఉంటే ఆ గాలి అత్యంత సంతృప్తికరంగా ఉన్న ట్లు లెక్క. 51–100 మధ్యలో ఉంటే సంతృప్తికరంగా, 100–200 మధ్య ఉంటే ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 200 దాటితే ఆరోగ్యానికి హాని అని, వాయు నాణ్యత తగ్గితే చిన్నారులు, వయోవృద్ధులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. కాలు ష్యం కారణంగా గుండె జబ్బులు, మెదడు భాగాని కి రక్త సరఫరా నిలిచిపోవడం, దీర్ఘకాలిక ఊపిరి తిత్తుల సమస్య, కేన్సర్, న్యూమోనియా వంటి వ్యాధులు వస్తాయంటున్నారు. వాయు నాణ్యత సూచీలో(ఈ ఏడాది జనవరి) గోదావరిఖని కేంద్రంలో 111, కరీంనగర్ కేంద్రంలో 100గా నమోదైంది. నివారణకు కాలుష్య నియంత్రణ బోర్డు ఎలాంటి చర్యలు చేపట్టట్లేదన్న విమర్శలున్నాయి. కాలుష్య నియంత్రణ అధికారులు వాయు కాలు ష్యం అంత ప్రమాదకరస్థాయిలో లేదంటున్నారు.
ధూళి లెక్కలు ఇలా..
గాలిలో సూక్ష్మ దుమ్ము, ధూళి కణాలను పీఎం(పర్టిక్యులేట్ మేటర్) అంటారు. 10 మైక్రో మీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే ధూళి కణాలను పీఎం 10గా వ్యవహరిస్తారు. పీఎం 2.5 కంటే పీఎం 10 కణాలు గాలిలో ఎక్కువ సేపు ఉంటాయి. తల వెంట్రుక మందం 50 మైక్రోగ్రాములు ఉంటే పీఎం 10 సైజ్ తలవెంట్రుక కంటే ఐదు రేట్లు తక్కువగా ఉంటుంది. ఇది గాలి ద్వారా ముక్కులోకి, తర్వాత గొంతు ద్వారా శ్వాసకోశాల్లోకి చేరుతుంది. దీనివల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. రక్షణ పొందాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అయితే, పీఎం 10 స్థాయి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో గోదావరిఖని కేంద్రంలో(119, 100), కరీంనగర్ కేంద్రంలో(103, 101) 100 మైక్రోగ్రాములు దాటడం ఆందోళన కలిగించేదే. గాలిలో నైట్రోజన్, కార్బన్‌డయాకై ్సడ్, సల్ఫర్‌మోనాక్స్‌డ్ పరిమితులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తేమ శాతం తగ్గి, కాలుష్య కారకాలు గాలిలో కలిసిపోవడంతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ప్రభావం ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు.
గాలిలో పడిపోతున్న నాణ్యతా ప్రమాణాలు
చలి, పొగమంచు, దుమ్ము, ధూళితో సమస్యలు
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న వాయు కాలుష్యం
చిన్నారులు, వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు
చలికాలంలో తీవ్ర ప్రభావం
చలికాలం వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉంటుంది.పిల్లలు, వృద్ధులపై ప్రభావం చూపుతుంది. పరిశ్రమల పొగ, రోడ్లపై లేచే, గనుల నుంచి వెలువడే దుమ్ము, వాహనాల పొగ తదితరాలకు దూరంగా ఉండాలి.
–శ్రీనివాస్, చాతి వైద్య నిపుణుడు,
గోదావరిఖని
అమలు కావడం లేదు
వాయు నాణ్యత మెరుగు కోసం ఎస్‌జీడీ యూనిట్లు నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్కడా అమలు కావడం లేదు. ఏక్యూఐలో తప్పుడు సంఖ్యలు చూపిస్తున్నారు. ఇప్పటికై నా పారిశ్రామిక ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి.
– ఉమామహేశ్వర్‌రావు, పర్యావరణవేత్త
ఇవి పాటించాలి..
వ్యర్థాలను కాల్చొద్దు
ఏసీల అతి వినియోగం వద్దు
పరిశ్రమల కాలుష్యాన్ని, రోడ్లపై దుమ్ము, ధూళి తగ్గించాలి
కాలం చెల్లిన వాహనాలను నడిపించొద్దు
మొక్కలు విరివిగా నాటాలి
Comments
Please login to add a commentAdd a comment