కుటుంబంతో కాసేపు..
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో సుమారు 42 వేల మంది పర్మినెంట్, మరో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పని(షిఫ్ట్)వేళలను మార్చేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. కార్మికుల స్పందన, కార్మిక సంఘాల సమాలోచనల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. అనేక ఏళ్లుగా కొనసాగుతున్న షిఫ్ట్ సమయాలను కార్మికులకు అనుకూలంగా మార్చాలనే యోచనలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఇటీవల నిర్వహించిన రక్షణ పక్షోత్సవాల్లో ఈ ప్రతిపాదన వచ్చింది. కార్పొరేట్ సేఫ్టీ కమిటీ సభ్యులు దీనిపై విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ప్రధానంగా ఓసీపీల్లో కొత్త షిఫ్ట్‌లతో సమయం ఆదా కావడంతోపాటు కార్మిక కుటుంబాలకు కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది.
కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలనేది లక్ష్యం..
ఉదయం కాస్త ముందుగా డ్యూటీకి వెళ్లినా మధ్యాహ్నం ఒంటి గంటకు ఇళ్లకు చేరుకునే కార్మికులు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తే ఎంతో ఊరట లభిస్తుందని యాజమాన్యం భావిస్తోంది. అలాగే సెకండ్ షిఫ్ట్ కార్మికులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి డ్యూటీకి వెళ్లవచ్చని, రాత్రి షిఫ్ట్ కార్మికులు కాస్త ముందుగా డిన్నర్ చేసి డ్యూటీకి వెళ్ల వచ్చని, ఇది కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈక్రమంలో యాజమాన్యానికి రక్షణ కమిటీ బృందాలు నివేదిక సమర్పించినట్లు సమాచారం. డ్యూటీ సమయాల మార్పుపై కార్మికుల నుంచి కూడా సానుకూలంగా స్పందన వచ్చినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో నూతన పనివేళలను అమలు చేయాలనే ప్రతిపాదన సీరియస్‌గా పరిశీలిస్తున్నారు.
సమయపాలనపై ప్రత్యేక నజర్
సింగరేణిలో ఎనిమిది గంటల పని విధానం కొనసాగుతోంది. భూగర్భగనులు, ఓసీపీల్లోనూ ఇదే పద్ధతి అమలు చేస్తున్నారు. అయితే భూగర్భగనుల్లో డ్యూటీకి కార్మికులు కాస్త ఆలస్యంగా వెళ్లినా పెద్దగా సమస్య రావడంలేదు. కానీ, ఓసీపీల్లో గంటన్నరపాటు సమ యం వృథా అవుతోందని అధికారులు తేల్చారు. ఇందులో కొంత సమయాన్ని ఆదా చేయాలనే యోచనలో సింగరేణి యాజమాన్యం ఉంది. ఓసీపీల్లో రోజూ నాలుగున్నర గంటల పాటు సమయం లంచ్‌బ్రేక్ పేరిట వృథాగా పోతోందని గుర్తించారు. ఈక్రమంలో దీనిలో కొంత సమయాన్ని ఆదా చేసినా సంస్థలో భారీ యంత్రాలను సమర్థవంతంగా వినియోగించవచ్చని అంటున్నారు. ఈక్రమంలో ఓసీపీల్లో లంచ్‌బ్రేక్ సమయం తగ్గించి ఇంటివద్దనే భోజనం చేసి వచ్చేలా షిఫ్ట్ సమయాలను మార్చాలని నిర్ణయించారు.
కార్మికులకు బ్రేక్‌ఫాస్ట్..
ఓసీపీల్లో డ్యూటీకి వెళ్లే కార్మికులు మస్టర్ పడిన స మయంలోనే యాజమాన్యం బ్రేక్‌ఫాస్ట్ అందజే యాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనివల్ల కార్మికులు యంత్రాల్లోనే కూర్చుని అల్పాహారం చే సి ఆ తర్వాత ఉత్పత్తిపై దృష్టి సారిస్తారని అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్డు, అరటిపండు, స మోస, బ్రెడ్, బన్.. లాంటివి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేక్‌ఫాస్ట్‌తో విధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతోపాటు లంచ్ పే రిట హాలేజీ రోడ్ల వెంట ప్రమాదకర ప్రయాణం ఉండదని భావిస్తున్నారు. దీనిపై కూడా యాజమాన్యం ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
డ్యూటీకి వెళ్లే ముందు తమ కుటుంబ సభ్యులతో కార్మికులు కాసేపు ప్రశాంతంగా, మనసు విప్పి మాట్లాడుకునేలా సింగరేణి యాజమాన్యం షిఫ్ట్‌ల సమయాన్ని మార్పు చేయాలని యోచిస్తోంది. పనిస్థలాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తోంది. ఉద్యోగి మానసికంగా దృఢంగా ఉంటే నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి సాధించడంతోపాటు ప్రమాదరహితంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని చెబుతోంది. ఇందుకోసం డ్యూటీ సమయాలను మార్చాలని ప్రణాళిక రూపొందించింది.
సమయం వృథా కాకుండా చర్యలు
బొగ్గు గనుల్లో షిఫ్ట్ సమయాల మార్పు
ఉద్యోగులకు అనుకూలంగా విధులు
ప్రతిపాదనలు రూపొందించిన సేఫ్టీ కమిటీ బృందం
ఓసీపీల్లో అమలుకు కసరత్తు
ప్రతిపాదిత సమయాలు(గంటల్లో)
షిఫ్ట్ నుంచి వరకు
మొదటి(ఫస్ట్) ఉదయం 5.00 మధ్యాహ్నం 1.00
రెండో(సెకండ్) మధ్యాహ్నం 1.00 రాత్రి 9.00
మూడో(రాత్రి) రాత్రి 9.00 వేకువజాము 5.00
ప్రస్తుత సమయాలు
మొదటి(ఫస్ట్) ఉదయం 7.00 మధ్యాహ్నం 3.00
రెండో(సెకెండ్) మధ్యాహ్నం 3.00 రాత్రి 11.00
మూడో(నైట్) రాత్రి 11.00 ఉదయం 7.00
ప్రీ(ముందు) ఉదయం 5.00 మధ్యాహ్నం 1.00
కొన్ని గనుల్లో ఐదు షిఫ్టుల విధానం కూడా కొనసాగుతోంది
Comments
Please login to add a commentAdd a comment