కాలువ నీటితో కరెంట్ ఉత్పత్తి
మినీ జలవిద్యుత్ కేంద్రాలు
మండలం ప్రాంతం ప్రాజెక్టులు
పెద్దపల్లి చందపల్లి 2
పెద్దపల్లి బొంపల్లి 1
పెద్దపల్లి తుర్కలమద్దికుంట 2
జూలపల్లి కాచాపూర్ 1
జూలపల్లి కుమ్మరికుంట 2
జూలపల్లి అబ్బాపూర్ 1
ధర్మారం కమ్మర్‌ఖాన్‌పేట 1
● ఎస్సారెస్పీ డీ–83 కాలువపై 10 మినీ హైడల్ ప్రాజెక్టులు
● జెన్‌కో ఆధ్వర్యంలో నిర్వహణ : 56 మందికి ఉపాధి కల్పన
● గ్రిడ్‌కు అనుసంధానంతో లో వోల్టేజీ సమస్యకు చెక్
● ఉత్పత్తి వ్యయం తక్కువ.. నాణ్యత ఎక్కువ
జూలపల్లి(పెద్దపల్లి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆయకట్టుకు సాగునీరు అందించే ఎస్సారెస్పీ డీ–83 కాకతీయ కాలువపై వివిధ చోట్ల ఏర్పాటు చేసిన మినీ హైడల్(జల విద్యుత్) ప్రాజెక్టుల ద్వారా రోజూ 9.16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అంతేకాదు.. వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇలా తయారైన కరెంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడం ద్వారా లో వోల్టేజీ సమస్య కూడా పరిష్కారమవుతోంది.
జెన్‌కో ఆధ్వర్యంలో నిర్వహణ..
శ్రీరాంసాగర్(ఎస్సారెస్పీ) ప్రాజెక్టు డీ – 83 ప్రధాన కాలువ, డీ – 86 కాలువల ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తున్నారు. ఇందులోని డీ–83పై మినీ హైడల్ ప్రాజెక్టులు నిర్మించగా.. జెన్‌కో ఆధ్వర్యంలో నిర్వహణ చేపట్టారు. ఇది జిల్లాలోని ధర్మారం మండలం నుంచి జూలపల్లి, పెద్దపల్లి వరకు, ఆ తర్వాత సుల్తానాబాద్ తదితర మండలాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. అయితే, ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు విడుదల చేసిన ప్రతీసారి డీ –83 మెయిన్ కెనాల్‌పై నిర్మించిన పది మినీ హైడల్ ప్రాజెక్టుల్లో రోజూ 9.16 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
పది జలవిద్యుత్ కేంద్రాలు..
శ్రీరాంసాగర్ డీ–83 మెయిన్ కెనాల్‌పై వివిధ చోట్ల పది మినీ హైడల్ కేంద్రాలు నిర్మించారు. వీటికి టర్బైన్లు బిగించారు. జనరేటర్లు ఏర్పాటు చేశారు. నీటి ఉధృతితో టర్బైన్లు తిరుగుతూ జనరేటర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనిని ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా 33కేవీ లైన్‌కు అనుసంధాంచి తుర్కలమద్దికుంటలోని సబ్‌స్టేషన్‌కు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి వివిధ డిస్కంలకు కరెంట్ పంపిణీ చేస్తున్నారు.
చొప్పదండిలో ప్రారంభం..
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రెవెల్లె గ్రా మం వద్ద ప్రారంభమయ్యే డి– 83 కాలువపై పలు చోట్ల 10 మినీ హైడల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ధర్మారం మండలం కమ్మరిఖాన్ పేట 6వ మైలురాయి వద్ద 500 కిలోవాట్ల సామ ర్థ్యం గల జల వద్యుత్ కేంద్రాలు నిర్మించారు. అదే విధంగా ఏడో మైలురాయి అబ్బాపూర్ వద్ద 500 కిలోవాట్లవి, తొమ్మిదో మైలురాయి కుమ్మరికుంట వద్ద 500 కిలోవాట్లవి, పదో మైలురాయి కుమ్మరికుంట వద్ద 220 కిలోవాట్లవి, పన్నెండో మైలురాయి కాచాపూర్ వద్ద 325 కిలోవాట్లవి, 14వ మైలురాయి పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట వద్ద 500 కిలోవాట్లవి, 16వ మైలురాయి చందపల్లి వద్ద 500 కిలోవాట్ల జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి.
56 మందికి ఉపాధి..
పది జల విద్యుత్ కేంద్రాల్లో 56 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. ఐటీఐ పూర్తిచేసి అప్రెంటీస్‌లో ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగులను జెన్‌కో అధికారులు ఇక్కడ ఆపరేటర్లుగా నియమించారు. కాలువలో సామర్థ్యం మేరకు నీటి పారకం ఉన్నసమయంలో ఆపరేటర్లు టర్బైన్లు ఆన్ చేస్తారు. జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాఫీగా సాగేలా నిత్యం పర్యవేక్షిస్తుంటారు. అంతేకాదు.. ప్రతీ వేసవిలో టర్బైన్లు, జనరేటర్లను ఓవర్‌హాలింగ్ చేసి.. విద్యుత్ ఉత్పత్తికి సన్నద్ధం చేయడంలో జెన్‌కో అధికారులు వీరికి సాయం చేస్తూ ఉంటారు.
నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి
ఎస్సారెస్పీ డీ– 83 మెయిన్ కాలువలో పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసినప్పుడు టర్బైన్లను ఆన్‌చేసి జనరేటర్ల ద్వారా నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. అక్కడి నుంచి సబ్‌స్టేషన్‌కు తరలించి డిస్కంకు సరఫరా చేస్తున్నాం. ఇక్కడ తక్కువ ఖర్చుతో జల విద్యుత్ ఉత్పత్తి చేయడమే మినీ హైడల్ ప్రాజెక్టుల లక్ష్యం.
– నరేశ్, డీఈ, జెన్‌కో
Comments
Please login to add a commentAdd a comment