వేతనాల కోసం ఎదురుచూపులు
గోదావరిఖని(రామగుండం): ఐదునెలలుగా వేతనాలు అందక సింగరేణి వ్యాప్తంగా ఉన్న కోల్ శాంప్లింగ్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సీహెచ్‌పీలోని కోల్‌శాంప్లింగ్ విభాగంలో ఈపీటీఆర్‌ఐ సంస్థ ద్వారా సుమారు 103 మంది కాంట్రాక్టు కార్మికులు సంస్థ వ్యాప్తంగా పనిచేస్తున్నారు. సింగరేణి నుంచి థర్డ్ పార్టీ శాంప్లింగ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈపీటీఆర్‌ఐ ఈ టెండర్ దక్కించుకుంది. ఈసంస్థ శాంప్లింగ్ పనులు నిర్వహించకుండా కేసీఎస్ సంస్థకు సబ్‌కాంట్రాక్టు అప్పగించింది. గతేడాది మార్చి వరకు సబ్‌కాంట్రాక్టు పొందిన సంస్థ వేతనాలు సరిగానే ఇచ్చినప్పటికీ ఏప్రిల్, మే నెలలో వేతనాలు ఇవ్వకుండా చేతులెత్తేసింది. సదరు సంస్థ నుంచి సుమారు రూ.15లక్షల వరకు రావాల్సి ఉందని కార్మికులు పేర్కొంటున్నారు. ఆ సంస్థ జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన సొమ్ము నిలిపివేసింది. దీంతో ఆ సంస్థ థర్డ్‌పార్టీ శాంప్లింగ్ నిర్వహణ నుంచి వైదొలిగింది. కానీ సంస్థవ్యాప్తంగా పని చేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు మాత్రం అందలేదు. ఈవిషయంలో సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుని ఈపీటీఆర్‌ఐ సంస్థ నుంచి తమకు వేతనాలు ఇప్పించాలని కోరుతున్నారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొంటున్నారు.
‘సాక్షి’ కథనంతో కొంత మేర చెల్లింపు..
కోల్‌శాంప్లింగ్ కార్మికులకు వేతనాలు రాక పండుగ పూట పస్తులేనా శీర్షినక ‘సాక్షి’లో గతేడాది అక్టోబర్ 28న కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు ఆ సంస్థ అధికారులతో సంప్రదింపులు జరిపారు. కాంట్రాక్టు కార్మికులకు రావాల్సిన వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంట్రాక్టర్ దిగివచ్చి రూ.3వేలు రెండు దఫాలుగా చెల్లించాడు. ఇంకా ఒక్కో కార్మికుడికి రూ.13వేలు రావాల్సి ఉంది. దీనిపై అధికారులు ఒత్తిడి చేసినా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సుమారు రూ.15లక్షలు కాంట్రాక్టర్ నుంచి కార్మికులకు రావాల్సి ఉంది. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించగా.. వేతనాలు చెల్లించాల్సింది వాస్తవమేనని, సంబంధిత సంస్థ బిల్లులు ఆపేశామన్నారు. అయినా కాంట్రాక్టర్ స్పందించడంలేదని పేర్కొన్నారు.
ఐదునెలలుగా ఎదురుచూపులు
పట్టించుకోని సింగరేణి యాజమాన్యం
Comments
Please login to add a commentAdd a comment