యూరియా కొరత లేదు
● రైతులు ఆందోళన చెందొద్దు ● అవసరమైన నిల్వలున్నాయ్
● వరి సాగులో సస్యరక్షణ పద్ధతులు పాటించాలి
● జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఎరువుల
కొరత లేదని, అసత్య ప్రచారాలు విని రైతులు ఆందోళన పడొద్దని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు 2,16,500 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారని, పంటలకు అవసరమైనన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల, మార్చిలో మరిన్ని యూరియా నిల్వలు అందుతాయని సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
సాక్షి: జిల్లాలో ఏయే పంటలు, ఎంత మేరకు సాగయ్యాయి?
డీఏవో: జిల్లాలోని 14 మండలాల్లో రైతులు 2,16,500 ఎకరాల్లో పంటలు సాగుచేశారు. ఇందులో 1,98,000 ఎకరాల్లో వరిపంట సాగైంది. 16 వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న, 2వేల ఎకరాల్లో కూరగాయలు, ఇతర పంటలు సాగయ్యాయి.
సాక్షి: రైతులకు అందుబాటులో నిల్వలు ఉన్నాయా?
డీఏవో: జిల్లాలోని రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిల్వలు నిండుకున్నట్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. వాటిని రైతులు నమ్మొద్దు. 5,573 మెట్రిక్ టన్నుల యూరియా డీలర్ల వద్ద, 2,059 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్, 2,600 మెట్రిక్ టన్నులు సొసైటీల వద్ద నిల్వలు ఉన్నాయి.
సాక్షి: ఇంకా యూరియా జిల్లాకు వచ్చే అవకాశముందా?
డీఏవో: జిల్లాకు మరో 11వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. ఈ నెలలో 4వేల మెట్రిక్ టన్నుల వరకు, మార్చిలో ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చే అవకాశం ఉంది.
సాక్షి: వరి పంట సాగుపై బోనస్ ప్రభావం ఉందా?
డీఏవో: ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందించింది. ఆ ప్రభావం ఈసారి పంట సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో 1,98,000 ఎకరాల్లో వరి పంట సాగైతే అందులో లక్షా 10వేల ఎకరాల్లో సన్నరకాలను సాగు చేశారు. మిగతా 88వేల ఎకరాల్లో దొడ్డురకం పంట సాగయింది.
సాక్షి: సాగైన పంటలకు యూరియా ఎంత మేర అవసరముంటుంది?
డీఏవో: జిల్లాలో సాగుచేసిన పంటలకు 37వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేశాం. గతేడాది ఇదే సీజన్‌లో 33వేల మెట్రిక్ టన్నులనే రైతులు కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 28,900 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది.
సాక్షి: ప్రభుత్వం గత నెల ఆరంభించిన రైతుభరోసా లబ్ధిదారులకు అందిందా?
డీఏవో: జిల్లాలో గ్రామసభలు నిర్వహించగా, 84వేల మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. అందులో ఎకరంలోపు ఉన్న లబ్ధిదారుల ఖాతాకు సొమ్ము జమ చేశారు. మిగతావారికి కూడా అందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment