![కమలంలో తగ్గని పోటాపోటీ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11111_mr-1739299637-0.jpg.webp?itok=Pe6EBija)
కమలంలో తగ్గని పోటాపోటీ
పెద్దపల్లిరూరల్: జిల్లా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి కొత్త రథసారథి వచ్చినా గ్రూపు రాజకీయాలు ఆగడంలేదు. జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన కర్రె సంజీవరెడ్డి విలేకరుల సమావేశం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మాత్రమే హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు హాజరవుతారని ప్రచా రం చేసినా స్థానికంగా ఉన్న ఆయన వర్గీయులు కూడా సమావేశానికి రాలేదు. దుగ్యాల, గుజ్జుల వర్గాలకు అంటిముట్టనట్టు ఉంటున్న మరోనేత, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి.. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంజీవరెడ్డికి శాలువా కప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్రాన్ని బీజేపీ కై వసం చేసుకోవడంతో కమలం నేతలు పోటాపోటీగా సంబరాలు జరుపుకుని వర్గపోరు సమసిపోలేదని చెప్పకనే చెప్పారు.
జిల్లా కార్యాలయంలో ఫ్లెక్సీల లొల్లి..
పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వర్గీయులే ఇప్పటిదాకా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులు ఆయన నివాసంలోనే కార్యక్రమాలను జరుపుకుంటూ వస్తున్నారు. కానీ, కర్రె సంజీవరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యాక మాజీ ఎమ్మెల్యే గుజ్జుల ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జిల్లా పార్టీ కార్యాలయంపై ఏర్పాటు చేశారు. అందులో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌రావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు చిలారపు పర్వతాలు, సురేశ్‌రెడ్డి ఫొటోలు ముద్రించకపోవడంపై ఆగ్రహించిన దుగ్యాల వర్గీయులు.. ఈ విషయాన్ని జిల్లా కొత్త అధ్యక్షుడు సంజీవరెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోతామంటూనే గ్రూపు రాజకీయాలు నడుపుతూ పార్టీని నియోజకవర్గంలో భ్రష్టు పట్టిస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకు రానున్న ‘బండి’..!
వర్గపోరును కట్టడి చేసేందుకు కొద్దిరోజుల్లోనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పెద్దపల్లికి రానున్నట్టు ఆ పార్టీ శ్రేణుల ద్వారా తెలిసింది. బీజేపీకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తున్నా.. నేతల అనైక్యతతోనే ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నామనే భావనలో అధిష్టానం ఉందని అంటున్నారు. బండి సంజయ్ చొరవతోనే బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సంజీవరెడ్డి నియామకమయ్యారని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రమంత్రి బండి సంజయ్‌ని ఆహ్వానించి.. జిల్లా నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా కార్యాచరణ చేపడుతున్నట్లు సమాచారం.
● కొత్త సారథి ప్రయత్నాలపై సర్వత్రా ఆసక్తి
Comments
Please login to add a commentAdd a comment