తెలుగు రాష్ట్రాలలోనే కాదు..దేశంలోనే ఒక సంచలనంగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు. తొమ్మిదేళ్ల పోరాటం, ఏడాది నాలుగునెలల ప్రజా సంకల్పయాత్ర... ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ కష్టార్జితం 2019 ఎన్నికల ఫలితం. అదే సమయంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి రోజు నుంచే తప్పులు చేయడం ఆరంభించి, చివరకి తాను ఏమి చేస్తున్నది తనకే తెలియని రీతిలో భ్రమలలో పడి పోయి ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు.
గతంలో ఎన్నడూ టీడీపీకి ఇంతటి దారుణమైన ఓటమి ఎదురు కాలేదు. ఇదంతా చంద్రబాబు నాయుడు స్వయంకృతం. పార్టీని రాజకీయ పార్టీగా కాకుండా ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చి, టీడీపీ కార్యకర్తలంటే మాఫియా లీడర్లు అన్నంతగా తయారుచేసి, ప్రజలను డబ్బుతో కొనేసి గెలవవచ్చనుకున్న చంద్రబాబు నాయుడి ప్లాన్‌ను ప్రజలు తిప్పి కొట్టారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి అయినా చంద్రబాబు ప్రభుత్వ ఓటమి ఒక గుణపాఠం అంటే ఆశ్చర్యం కాదు. ఇదే సమయంలో గతంలో తెలుగుదేశంకు మద్దతు ఇచ్చిన దాదాపు అన్ని సామాజికవర్గాలలో పూర్తి మార్పు వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు తెలియచేస్తాయి.
ప్రాంతాల వారీగా చూసినా, సామాజికవర్గాల వారీగా పరిశీలించినా టీడీపీ ఎంతగా ప్రజలలో వ్యతిరేకత తెచ్చుకుంది అర్ధం అవుతుంది.రాయలసీమలో ఏభై రెండు సీట్లు ఉంటే కేవలం మూడు సీట్లనే టీడీపీ గెలుచుకుంటే,వైఎస్ ఆర్ కాంగ్రెస్ మొత్తం 49 నియోజకవర్గాలలో పాగా వేయగలిగింది. కడప,కర్నూలలో ఒక్క సీటు కూడా టీడీపీకి రాలేదు. అలాగే కోస్తాలో విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో కూడా మొత్తం అన్ని స్థానాలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ వే.ఉభయ గోదావరి జిల్లాలలో గత సారి కాపు సామాజికవర్గం టీడీపీకి అండగా ఉండగా,ఈసారి ఆ పరిస్థితి లేదు. ఉభయ గోదావరి జిల్లాలలో కలిపి ముప్పై నాలుగు సీట్లు ఉంటే కేవలం ఐదు సీట్లే టీడీపీకి వచ్చాయి. కమ్మ ప్రాబల్యం ఉన్న కృష్ణ, గుంటూరు, ప్రకాశం వంటి జిల్లాలలో టీడీపీ గెలిచిందా అంటే అదీ లేదు.
ఈ జిల్లాలలో కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ దే హవా అయింది.ఉత్తరాంధ్రలో గతసారి టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ఈసారి దారుణంగా ఓడిపోయింది. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి సామాజికవర్గాల సమీకరణ పూర్తిగా మారిపోవడం, అత్యధిక సామాజికవర్గాలు వైఎస్ ఆర్ కాంగ్రెస్‌కు అండగా నిలబడ్డాయని చెప్పవచ్చు. రెడ్డి సామాజికవర్గం నుంచి నలభై ఎనిమిది మంది గెలిస్తే వారంతా ఒక్క వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచే కావడం విశేషం. టీడీపీ పక్షాన ఒక్కరు కూడా నెగ్గలేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కమ్మ సామాజికవర్గం కు చెందినవారు గతంలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో రెండుపార్టీలలో కలిపి కేవలం పదిహేడు మంది మాత్రమే గెలిచారు. టీడీపీ నుంచి పదకుండు మంది, వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఆరుగురు గెలుపొందారు. కాపులలో గతసారి వైసీపీ పక్షాన కేవలం ముగ్గురు మాత్రమే గెలిస్తే ఈసారి ఇరవై ఇద్దరు గెలిచారు. టీడీపీ నుంచి ముగ్గురే నెగ్గారు. బీసీలు మొత్తం ముప్పై నాలుగు మంది గెలిస్తే వారిలో ఇరవై ఎనిమది మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ వారే. ముస్లింలు, ఎస్టిలు మొత్తం వైసీపీ నుంచే గెలిచారు.
షెడ్యూల్ కులాల వారు మొత్తం ఇరవై తొమ్మిది మందికి గాను ఇరవైఏడు చోట్ల వైఎస్ ఆర్ కాంగ్రెస్ విజయపతాకం ఎగురవేస్తే, టీడీపీ ఒక చోట, జనసేన ఒక చోట గెలిచాయి. ఇతర సామాజికవర్గాల వారు పది మంది గెలిస్తే వారిలో ఇద్దరు మాత్రమే టీడీపీ వారు. జనసేన పక్షాన కేవలం ఒక్కరే అధి కూడా ఒక ఎస్సి ఎమ్మెల్యే విజయం సాదించారు. గతంలో ప్రధానంగా కాపు సామాజికవర్గాన్ని ప్రభావితం చేసి టీడీపీ విజయానికి దోహదపడిన జనసేన ఈసారి ఆ వర్గం ఓట్లను కూడా పూర్తిగా పొంద లేకపోయింది. 2009లో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ పక్షాన కాపు ఎమ్మెల్యేలు ఆంద్ర ప్రాంతంలో పది మంది గెలిస్తే, ఈసారి జనసేన పక్షాన ఒక్క కాపు ఎమ్మెల్యే కూడా గెలవకపోవడం విశేషం. చివరికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీచేసి పరాజయం చెందారు. 2019 ఎన్నికలు జగన్ వేవ్‌తో ఏక పక్ష ఎన్నికలుగా మారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అఖండ విజయం సాదించిందని చెప్పవచ్చు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment