7 మండలాలు వెనక్కి రప్పించాలి : హరీశ్‌రావు | BRS Leader Harish Rao On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

7 మండలాలు వెనక్కి రప్పించాలి : హరీశ్‌రావు

Published Wed, Jul 3 2024 6:05 AM | Last Updated on Wed, Jul 3 2024 6:06 AM

BRS Leader Harish Rao On CM Revanth Reddy

లోయర్‌ సీలేరు కూడా: హరీశ్‌రావు 

ఆ తర్వాతే విభజన సమస్యలపై ముందుకెళ్లాలి 

చంద్రబాబుతో భేటీలో రేవంత్‌ చొరవ చూపాలి

సాక్షి, హైదరాబాద్‌: దిగువ సీలేరు విద్యుత్‌ కేంద్రంతోపాటు ఏపీలో విలీనం చేసిన 7 మండలాలను వెనక్కి రప్పించిన తర్వాతే, ఇతర విభజన సమస్యలపై ముందుకెళ్లాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. విభజన సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం లేఖ రాయడం సంతోషకరమన్నారు. అయితే చంద్రబాబుపైనే ప్రస్తుతం ఎన్‌డీయే ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉన్నందున ఏపీ సీఎంపై ఒత్తిడి చేసి గతంలో విలీనం చేసిన ఏడు మండలాలతో పాటు దిగువ సీలేరు ప్రాజెక్టు తెలంగాణకు దక్కేలా చూడాలని చెప్పారు. 

తెలంగాణభవన్‌లో మంగళవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఏడు మండలాలు, దిగువ సీలేరును తెలంగాణ నుంచి వేరు చేయడంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అప్పట్లోనే తీవ్రంగా స్పందించి బంద్‌కు పిలుపునిచి్చన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో ఏడు మండలాల విలీనం బిల్లును బీజేపీ ప్రవేశపెట్టగా, కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమకు అభ్యంతరం లేదని, ఏడు మండలాలు, దిగువ సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్‌ చొరవ చూపాలన్నారు. 

మురికి కూపంగా పల్లెలు, పట్టణాలు... 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పల్లెలు, పట్టణాలు మురికి కూపాలుగా మారాయని, పల్లెలు కన్నీరు పెడుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఆర్‌ఎస్‌ పాలనలో గ్రామ పంచాయతీలకు ప్రతీ నెలా రూ. 275 కోట్లు చొప్పు ఏటా రూ.3,330 కోట్లు, పట్టణాలకు ఏటా రూ.1,700 కోట్లు ఇచ్చామన్నారు. 

కాంగ్రెస్‌ గడిచిన ఏడు నెలలుగా నయాపైసా ఇవ్వకపోవడంతో గ్రామ కార్యదర్శులు సొంతజేబు నుంచి వేలాది రూపాయలు ఖర్చు చేసి ఇబ్బందులు పడుతున్నారన్నారు. డీజిల్‌ పోసే పరిస్థితి లేక ట్రాక్టర్లు మూలన పడగా, రోడ్‌ ట్యాక్స్‌ కట్టలేదని ట్రాక్టర్లు సీజ్‌ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఏడు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేవని, కరెంటు బిల్లులు, ట్రాక్టరు కిస్తీల చెల్లింపు, వీధి లైట్లు వేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. సర్పంచ్‌లతోపాటు జిల్లా, మండల పరిషత్‌ పదవీకాలం ముగుస్తున్నా, ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు.  

ఓటేసిన పాపానికి రైతు ఆత్మహత్య  
కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసిన పాపానికి ఖమ్మం జిల్లాలో రైతు ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభాకర్‌ తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, రైతుల తరపున బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందన్నారు. ప్రభాకర్‌ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూధనాచారి, బీఆర్‌ఎస్‌ నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎర్రోల్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, పల్లె రవికుమార్, వెంకటేశ్వర్‌రెడ్డి, బమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement