విద్యుత్ అంశంపై అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017లోనే స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటూ కేంద్రంతో ఒప్పందం చేసుకుందన్న సీఎం రేవంత్
తెలంగాణ విద్యుత్ సంస్థలను కేం్రద్రానికి అప్పజెప్పింది
ఎన్నికల్లో రైతులు దెబ్బతీస్తారని తెలిసి దాచిపెట్టింది
అది ఇప్పుడు రాష్ట్ర డిస్కంలకు గుదిబండగా మారింది
మీటర్ల బిగింపు ఒప్పందంపై బీఆర్‌ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్
నాటి ఒప్పంద పత్రాలను సభ ముందుంచిన సీఎం
సీఎంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల విమర్శలు సరికాదు: భట్టి
సీఎం రేవంత్ ఎవరో తెచ్చిన ఏదో కాగితాన్ని పట్టుకుని మాట్లాడుతున్నారు: హరీశ్
తొందరపడి మాట్లాడితే సీఎం కుర్చీ గౌరవం తగ్గుతుంది
పాత మీటర్లను ‘స్మార్ట్’గా మార్చడానికే మేం ఒప్పుకున్నాం.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం కాదు..
కేంద్రం పెట్టిన రూల్స్‌ను ఒప్పుకోబోమని కేసీఆర్ సభలోనే ప్రకటించారు
రూ. 30 వేల కోట్ల రుణ సేకరణ అవకాశాలనూ వదులుకున్నాం
విద్యుత్ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సభలో ‘కరెంటు’ అంశం మంటలు రేపింది. ‘స్మార్ట్ మీటర్ల’ ఏర్పాటు ఒప్పందం, వ్యవసాయానికి మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యారనే అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో శాసనసభ దద్దరిల్లింది. శనివారం ఉదయం సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీశ్‌రావుల మధ్య వివిధ అంశాలపై జరిగిన సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆ సమయంలో వారు చేసిన వ్యాఖ్యలు.. రాత్రి శాసనసభ ముగిసే సమయంలో ‘కరెంటు’ వివాదానికి తెరలేపాయి.
విద్యుత్ సంస్కరణలు అమలు చేయనందుకు తమ హయాంలో రూ.30 వేల కోట్లు నిధులు కోల్పోయామని ఉదయం హరీశ్‌రావు చెప్పగా.. అసలు బీఆర్‌ఎస్ సర్కారు 2017లోనే కేంద్రంతో మీటర్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. దీనికి ఆధారంగా నాటి ఒప్పంద పత్రాలను రాత్రి శాసనసభ ముందుంచారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
బీఆర్‌ఎస్ వాదన సత్యదూరం
విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించే అంశంపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న వాదనలు పూర్తిగా సత్యదూరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ సమక్షంలో 2017 జనవరి 4న ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2017 జూన్ 30 నుంచి ఆరు నెలల్లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్‌ఫార్మర్లకు మీటర్లు బిగిస్తామని, 2018 జూన్ 30లోగా ఫీడర్లకు మీటర్లు పెడతామని, 2018 డిసెంబర్ 31 లోగా 500 యూనిట్లు, ఆపై విద్యుత్ వాడే వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు, 2019 డిసెంబర్ 31 లోపు 200 యూనిట్ల విద్యుత్, ఆపైన వాడే వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకుంది.
ఆ ఒప్పందాలను అమలు చేయకపోతే, స్మార్ట్ మీటర్లను బిగించకపోతే.. కేంద్ర ప్రభుత్వం డిస్కంల మీద చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పుడు వాటి మెడపై కత్తి వేలాడుతోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం. వాళ్లు, వీళ్లు ప్రేమించుకున్నప్పుడు, సంతకాలు పెట్టుకున్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కనిపించలేదు. ఎన్నికలు వచ్చేప్పటికి రైతులు ఉరి వేస్తారని తెలిసి దాన్ని దాచిపెట్టారు. ఈ ఒప్పందంతో తెలంగాణ విద్యుత్ సంస్థలను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు. డిస్కంలకు విధిలేని పరిస్థితిని తెచ్చిపెట్టారు..’’ అని రేవంత్ మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలి..
ఉదయ్ ఒప్పందంపై సంతకాలు పెట్టలేదని, మీటర్లు పెట్టబోమని చెప్పామని బీఆర్‌ఎస్ నేతలు చెప్తున్న మాటలన్నీ అబద్ధాలేనని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘‘ఈ ఒప్పందంపై అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఐఏఎస్ అజయ్ మిశ్రా, సదరన్ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి, నార్తర్న్ సీఎండీ ఏ.గోపాల్‌రావు సంతకం పెట్టారు. ఇప్పుడు విధిలేక మన వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
అందుకు బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శనపైనా సీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘మేడిగడ్డకు వెళ్లి సెల్ఫీలు దిగారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. పదవి పోయినందుకు మీకు తొందర ఉండాలిగానీ.. నాకేమీ తొందరలేదు’’ అని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌కు తొందరెక్కువ: హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డికి తొందరపాటు ఎక్కువని, సభను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎవరో ఏదో కాగితం తెచ్చిస్తే తొందరపడి మాట్లాడటం వల్ల సీఎం కుర్చీ గౌరవాన్ని తగ్గిస్తుందని.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మాట్లాడితే హుందాతనం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘‘నేను ఉదయం మాట్లాడేప్పుడు ఉదయ్ పథకం కింద కేంద్రం బలవంతంగా రూ.9 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర సర్కారుపై రుద్దిందని చెప్పాను. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఓ కాగితం తెచ్చి మీరు సంతకాలు పెట్టారు, మీటర్లు పెడుతున్నారంటూ సుదీర్ఘంగా చెప్పారు.
అసలు మేం చెప్పిందేంటి? కేంద్రం రూ.30 వేల కోట్లు అప్పు అదనంగా ఇస్తామన్నా.. వ్యవసాయ బోరుబావుల వద్ద మీటర్లు పెట్టబోం, విద్యుత్ సంస్కరణలను ఒప్పుకోమనే చెప్పాం. నాటి సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలోనే ఈ విషయం స్పష్టం చేశారనే నేను ఉదయం వివరించాను. కానీ సీఎం రేవంత్ ఏదో అనుకుని ‘ఉదయ్’ కాగితాన్ని తెచ్చి చూపించారు. 2017 జనవరి 4న అందిన ఆ పేపర్‌లో వ్యవసాయ బోరు బావులకు కాకుండా.. అన్నివర్గాల కరెంట్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించాలని స్పష్టంగా ఉంది. అంటే పాత మీటర్లు ఉన్న చోట కొత్తగా స్మార్ట్ మీటర్లు పెట్టడమే తప్ప.. కొత్తగా మీటర్లు పెట్టే ముచ్చటే అందులో లేదు..’’ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
నేను చెప్పిన ‘రూల్స్’ పేపర్ వేరు
ఇక తాను చెప్పిన కాగితం కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ నుంచి 2021 జూన్ 9న వచ్చిందని హరీశ్‌రావు వివరించారు. ‘‘దాని ప్రకారం.. ఏ రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పు తీసుకోవాలని అనుకుంటున్నాయో ప్రతిపాదనలు పంపాలని కోరారు. 2022 నుంచి 2025 వరకు విద్యుత్ సంస్కరణలు అమలుచేస్తే.. అరశాతం అదనంగా 4 శాతం జీఎస్‌డీపీ వరకు అప్పు అధికంగా పొందే వెసులుబాటు ఇస్తామని కేంద్రం పేర్కొంది. దానికి ఒప్పుకుంటే తెలంగాణకు రూ.30 వేల కోట్లు సమకూరేవి.
అయితే సంస్కరణల్లో భాగంగా డిస్కంల ప్రైవేటీకరణ, వ్యవసాయ బోర్లు, బావులకు మీటర్లు పెట్టడం వంటివి రైతులకు ఇబ్బంది తెస్తాయని గుర్తించి.. ఆ నిబంధనలకు మేం ఒప్పుకోలేదు’’ అని స్పష్టం చేశారు. కానీ సీఎం సభను, ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేశారని హరీశ్ ఆరోపించారు. ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కల్పించుకుని హరీశ్‌రావు వ్యాఖ్యలను ఖండించారు. ‘‘ఏదో ఓ కాగితాన్ని చూపుతూ సభను, ప్రజలను సీఎం తప్పుదారి పట్టిస్తున్నారంటూ హరీశ్ మాట్లాడటం సరికాదు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడతామని సీఎం ఎక్కడైనా చెప్పారా? మీరు తలకిందులుగా తపస్సు చేసినా మేం రైతులకు మీటర్లు పెట్టబోం..’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment