సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాల విస్తరణపై దృష్టి కేంద్రీకరించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సోమవారం మరో కీలక అడుగు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీనగర్) జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరు కానుండటంతో సభ నిర్వహణ ఏర్పాట్లను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
సుమారు రెండు లక్షల మంది సభకు హాజరవుతారని వారంరోజులుగా సభ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బీఆర్‌ఎస్ తెలంగాణ నేతలు చెప్తున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఔరంగాబాద్ జబిందా మైదానంలో జరిగే సభకు హాజరయ్యేందుకు కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరతారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలను సీఎం కేసీఆర్ ఔరంగాబాద్ సభా వేదికగా ఎండగట్టనున్నారు.
మహారాష్ట్రలో మూడో బహిరంగ సభ..
బీఆర్‌ఎస్‌గా అవతరించిన తర్వాత పొరుగున ఉన్న మహారాష్ట్రపై దృష్టి కేంద్రీకరించిన కేసీఆర్ ఫిబ్రవరి 6న నాందేడ్‌లో చేరికల సభ, మార్చి 26న కాందార్ లోహలో బహిరంగసభ నిర్వహించారు. మూడో బహిరంగ సభను తొలుత ఔరంగాబాద్ అంకాస్ మైదానంలో నిర్వహించాలని భావించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో జబిందా గ్రౌండ్‌కు వేదికను మార్చారు.
బీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్, జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, పార్టీ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు మాణిక్ కదమ్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్, పార్టీ నేతలు వేణుగోపాలచారి, గ్యాదరి బాలమల్లు, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, రాఘవ తదితరులు వారంరోజులుగా ఔరంగాబాద్‌లో మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జన సమీకరణ కోసం సన్నాహాక సమావేశాలు నిర్వహించడంతో పాటు డిజిటల్ ప్రచార రథాలు, వాల్ పోస్టర్లతో తెలంగాణ ప్రభుత్వ పథకాలను స్థానికంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న చేరికలు
బీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు మహారాష్ట్రకు చెందిన బీజేపీ, ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన, ఎంఐఎం తదితర పార్టీ లకు చెందిన నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె, దినేశ్ బాబూరావు మడావీ, ఔరంగాబాద్ జెడ్పీ చైర్మన్ షెల్కే వంటి కీలక నేతలు బీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు.
మహారాష్ట్ర ప్రదేశ్ సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ పార్టీతో పాటు పలు సామాజిక సంస్థలు బీఆర్‌ఎస్‌లో తమ విలీనాన్ని ప్రకటించాయి. సోమవారం ఔరంగాబాద్ బహిరంగ సభ వేదికగా వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు సుమారు 200 మంది ముఖ్య నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment