నిర్మాత దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తున్నారా? నిర్మాతగా బిజీగా ఉన్నప్పటికీ రాజకీయాలపై దిల్ రాజు మనసుపడ్డారా? ప్రజలనుంచి ఎన్నికై చట్టసభకు వెళ్ళాలని అనుకుంటున్నారా? మరి దిల్ రాజుకు అవకాశం ఇవ్వబోతున్న పార్టీ ఏది? రాజకీయ పార్టీని దిల్ రాజు ఎంచుకుంటారా? లేక ఏదైనా పార్టీ దిల్ రాజును ఎంచుకుందా?
సినిమా సక్సెస్, పాలిటిక్స్.?
దిల్ రాజు.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. తెలుగు చిత్రసీమలో డిస్ట్రిబ్యూటర్‌గా, చిన్న నిర్మాతగా ప్రస్థానం ప్రారంభించి ఈ రోజు టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరిగా ఎదిగారు. దిల్ రాజు సినిమా తీసినా..సినిమా కొన్నా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనేవిధంగా ఒక బ్రాండ్‌గా మారారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజు ఓ అగ్ర నిర్మాతగా అవతరించడం ఓ సక్సెస్ స్టోరీ.
ఇప్పుడు ఓ బడా నిర్మాతగానే కాకుండా.. సెలబ్రిటీగా కూడా ఎదిగారు. ఈ క్రమంలో సహజంగానే రాజకీయ నాయకుల దృష్టి రాజు లాంటివారిపై పడటం సహజం. అదే సమయంలో నాయకులకు దక్కే గౌరవ, మర్యాదలు, హోదా వంటివాటితో పాటు.. రాజకీయాల్లోకి కూడా వస్తే తమ ప్రాంతానికేమైనా చేయొచ్చన్న ఆశలుండటమూ సహజమే. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా చర్చలు సాగుతున్నాయి.
ఈ అడుగులు దేనికి సంకేతం?
హాత్ సే హాత్ జోడోయాత్ర పేరుతో తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా దిల్ రాజు తను స్వయంగా నిర్మించి, నిర్వహిస్తున్న ఆలయానికి రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా పిలవడంతో రాజకీయ వర్గాల్లో దిల్ రాజు పొలిటికల్ అరంగేట్రంపై చర్చ మొదలైంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రేవంత్ వచ్చిన సందర్భంగా... మోపాల్ మండలంలోని దిల్ రాజు సొంత గ్రామం నర్సింగ్‌పల్లిలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయానికి పిలిచి ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు.
ఈ కార్యక్రమంతో దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి బీజం పడ్డట్టేనన్న చర్చకు తెర లేచింది. అయితే అటు బలగం సినిమా సమయంలో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌తోనూ ఆయన చనువుగా ఉండటాన్ని గమనించినవారు.. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను కాదని.. దిల్ రాజు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ద్వారాలు తెరిచే ఉన్నాయట.!
ఓ సినీ నిర్మాతగా రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలవారితోనూ సత్సంబంధాలు కొనసాగించడం మామూలు విషయమే అయినా... ఏ పార్టీ నుంచి అవకాశం లభించినా దిల్ రాజు రాజకీయాలవైపు రావడం ఖాయమన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అధికారపార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బలమైన లీడర్ గా ఉన్నారు.
మరోవైపు కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి ఇంకా అభ్యర్థిత్వమైతే ఖరారు కాలేదు. నిజామాబాద్ రూరల్‌లో దిల్ రాజు వంటి పాపులర్ నిర్మాతను బరిలో దించితే ఎలా ఉంటుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నట్లు సమాచారం. రేవంత్‌రెడ్డికి దిల్‌రాజును తీసుకురావాలనే ఆలోచన బలంగా ఉందని అంటున్నారు. మరోవైపు బాజిరెడ్డి గోవర్థన్ అనూహ్య పరిణామాలేమైనా జరిగి నియోజకవర్గం మార్చుకుంటే... అధికార బీఆర్ఎస్ నుంచి కూడా దిల్ రాజుకు డోర్స్ ఓపెన్ గానే ఉన్నట్టుగా మరో ప్రచారమూ జరుగుతోంది.
ఎంట్రీ ఎక్కడ? అర్బన్? రూరల్?
అటు కాంగ్రెస్ కూ.. ఇటు దిల్ రాజుకు ఇద్దరికీ సమ్మతంగా ఉండటంతో... రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థిగా దిల్ రాజు బరిలోకి దిగే అవకాశాలు కొట్టిపారేయలేమని అనేవారూ ఉన్నారు. మరోవైపు అటు అధికార బీఆర్ఎస్ నాయకులతో కూడా దిల్ రాజుకున్న సంబంధాల నేపథ్యంలో.. ఆయన రాజకీయాల్లోకి రావాలని బలంగా అనుకుంటే గనుక... వచ్చే అసెంబ్లీ ఎన్నికలే బలమైన ముహూర్తం కానున్నట్టుగా చర్చ ఊపందుకుంటోంది. అయితే టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పొలిటికల్ అరంగేట్రానికి వేదిక కానున్న పార్టీ ఏది? హస్తం పార్టీయా? గులాబీ పార్టీయా? ఇప్పుడిదే చర్చ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రసవత్తరంగా సాగుతోంది.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment