సాక్షి, హైదరాబాద్ : ‘‘అబ్బా ఎలాగూ గెలిచాం.. మరో ఐదు స్థానాలు గెలుచుకుని ఉంటే ఇంకా బాగుండేది. టెన్షన్ పోయేది.. ఎన్నో తలనొప్పులు తప్పేవి..’’.. అసెంబ్లీ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ దాటినా కూడా కాంగ్రెస్ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఇది. ప్రజలు అధికారమిచ్చారే గానీ.. మంచి మెజారిటీ ఇవ్వలేదనే భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
తెలంగాణ ఏర్పాటై తొలుత బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లలోనే గెలవగా.. ఇప్పుడు కాంగ్రెస్‌కు అంతకంటే ఒకేసీటు ఎక్కువగా వచ్చింది. ఈ క్రమంలో కొందరు పార్టీ ఫిరాయించినా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉంటుందని నేతలు చెప్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చాకచక్యంగా ఢీకొట్టేందుకు, పాలనలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు మరో ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు ఉండి ఉంటే బాగుండేదని అంటున్నారు.
తక్కువ మెజారిటీ కారణంగా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందేనని పేర్కొంటున్నారు. మహారాష్ట్ర షిండేతో శివసేనను చీల్చినట్టుగా.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రయోగం చేసే అవకాశం లేకపోలేదని, అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందే సిద్ధమై ఉండాలని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుండటం గమనార్హం.
వీడినవారు మళ్లీ వస్తారా?
కాంగ్రెస్‌లో చాలాకాలం పనిచేసి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లినవారిలో కొందరు ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరత కోసం అలాంటి వారిని తిరిగి రప్పించుకుంటారా అనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికిప్పుడే ఇలాంటి పరిణామాలకు ఆస్కారం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త సుస్థిరత సాధించాకే ఏవైనా ప్రయోగాలకు సిద్ధమవుతుందని నేతలు చెప్తున్నారు.
ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎదురవుతాయని భావిస్తున్న పరిణామాలను ఢీకొట్టేందుకు ఇప్పటినుంచే రూట్‌మ్యాప్ తయారవుతుందని, వందేళ్ల చరిత్ర కలిగిన తమకు అధికారం నిలుపుకోవడం ఎలాగో తెలుసని అంటున్నారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అవలంబిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
సీనియర్ నేతలంతా గెలవడంతో..
కాంగ్రెస్ పార్టీలో ఉద్ధండులుగా పేరొందిన నేతలు చాలా మంది ఈసారి ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్‌బాబు, జి. వివేక్ వెంకటస్వామి, పి.సుదర్శన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు గెలిచారు.
సీనియర్ నేతలు జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి ఒడిదుడుకులకు అవకాశం ఉండబోదని, ఐదేళ్ల పాటు అధికారం పదిలంగా ఉంటుందనే ధీమా కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అధిష్టానానికీ కత్తిమీద సామే
బొటాబొటీ మెజారిటీ పరిస్థితుల్లో సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలన్నది కూడా కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సామేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో సీఎం ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరికి ప్రాధాన్యం లభించకపోయినా అలిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. సీఎం విషయంలో ఎమ్మెల్యేలను ఒప్పించినా.. తర్వాత మంత్రివర్గ కూర్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీ పదవులు వంటి చాలా వ్యవహారాల్లో అధిష్టానం తిప్పలు పడాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment