తెలంగాణలో మూడు ప్రధాన ప్రధాన పక్షాలు తమ రాజకీయ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి తంటాలు పడుతున్నాయి.అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తమకు కాంగ్రెస్, బీజెపీలతో సంబంధం లేదని చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్తో తమకు ఎలాంటి మైత్రి లేదని చెప్పడానికి పాట్లు పడుతున్నాయి. ప్రత్యేకించి బీఆర్‌ఎస్ కన్నా, కాంగ్రెస్,బీజేపీలకే ఈ పాతివ్రత్యం నిరూపణ సమస్య ఎక్కువగా ఎదురవుతోంది.
బీజేపీతో బీఆర్ఎస్ మిలాఖత్ అయిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపిస్తే.. దానిని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖండించి మరీ మజ్లిస్ తో పొత్తు ఉన్న పార్టీతో తాము కలిసే సమస్యే లేదని, కేసీఆర్ పై కాంగ్రెస్‌కే ప్రేమ ఉందని అన్నారు. ఇక.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తమకు బీఆర్ఎస్ కు సంబంధం లేదని, కాంగ్రెస్..బీఆర్ఎస్ ఒకటేనంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు.
✍️ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాము కాస్త వెనకబడ్డామన్న సంగతిని అర్దం చేసుకున్న బిజెపి ఖమ్మంలో సభను పెద్ద ఎత్తున నిర్వహించింది. అయినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ తరపున ప్రత్యేకించి గెలవగలిగే నియోజకవర్గం ఏది అన్నది చెప్పలేని పరిస్థితే. ఆ సంగతి పక్కన బెడితే అమిత్ షా తన ప్రసంగం ఆరంభిస్తూనే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వద్దా?కావాలా? అంటూ ప్రశ్న వేసి సభికుల నుంచి వద్దనే జవాబు తెప్పించుకున్నారు. బీజేపీ సభ కనుక ఆ పార్టీ మద్దతుదారులే అధికంగా ఉంటారు. అమిత్ షా ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్, భద్రాద్రి రాముడి సెంటిమెంట్ ను ప్రయోగించే యత్నం చేశారు. తెలంగాణ పోరాట యోధులు, స్వాతంత్రయోధులు జమలాపురం కేశవరావు పేరును ప్రస్తావించడం ద్వారా తమ భావజాలం కూడా నిజాం ప్రభువుకు వ్యతిరేకమైనదే అని చెప్పడానికి యత్నించారు.
✍️ మజ్లిస్ పార్టీతో పొత్తు ఉన్నందునే కేసీఆర్ భద్రాద్రి రాముడికి శ్రీరామనవమి రోజున పట్టువస్త్రాలు స్వయంగా సమర్పించడం లేదని ఆరోపించారు. తమ పార్టీ ముఖ్యమంత్రి వస్తే రాముడి పాదాల వద్ద కమలం ఉంచుతారని ఆయన చెప్పారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్ ఉన్నందునే కేసీఆర్ భద్రాద్రి వెళ్లి కూడా ఆలయానికి వెళ్లలేదని అన్నారు. తెలంగాణలో ఆయా వర్గాలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించిన అమిత్ షా కొన్ని విమర్శలు చేసినా, కేసీఆర్ కాని, ఆయన కుమారుడు కేటీఆర్ కాని సీఎం కాలేరని అమిత్ షా అన్నప్పటికీ, ఆయన స్పీచ్ లో అంత విశ్వాసం కనిపించలేదు.
✍️ కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న సాయం ,అందులో తెలంగాణకు అందుతున్న మొత్తం తదితర వివరాలు కూడా షా చెప్పారు. ఇక్కడ గమనించవలసిన విశేషం ఏమిటంటే ఇంతకాలం బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు గురించి కాని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుమార్తె కవిత పై బిజెపి వారు చేసిన ఆరోపణలు మొదలైనవాటిని అసలు ప్రస్తావించకపోవడం. ఆయన కావాలని వదిలేశారా? మరే కారణమో తెలియదు కాని ఈ విషయం సహజంగానే చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ అగ్రనేతల కుటుంబాన్ని 4జి, కేసీఆర్ కుటుంబాన్ని 2జి అని, ఒవైసీ కుటుంబాన్ని 3జి అని అభివర్ణించడంలో అర్దం ఏమిటో తెలియదు. సాంకేతికంగా అవన్ని ఎంతో ఉపయోగపడేవి కదా అనిపిస్తుంది.బండి సంజయ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పెగ్గులు అంటూ చేసిన విమర్శలు అంత బాగోలేదు. అలాంటివి రాజకీయ సంస్కృతిని పాడు చేసే అవకాశం ఉంది.
✍️ ఈ సభ తర్వాత బీజేపీ రాష్ట్ర నేతలతో ఆయా అంశాలపై చర్చించినప్పుడు పార్టీలో సమన్వయం కొరవడిందని, ఇంకా మెరుగుపడాలని అమిత్ షా అన్నారట. అంతేకాదు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒకటేనన్న ప్రచారాన్ని ఖండించాలని ఆయన చెప్పారట. మరో సంగతి ఏమిటంటే కొద్ది రోజుల క్రితం బీజేపీ అధిష్టానం తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు,నేతలను పంపిందట. వారు వచ్చి అభిప్రాయ సేకరణ జరిపితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఎక్కువ మంది అడిగారట. అలాగే బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారన్న ప్రశ్న కూడా వేశారట. దీనిని బట్టే జిల్లాలలో సైతం బిజెపి సరళిపై క్యాడర్ లో అనుమానాలు వచ్చాయన్నమాట. వీటన్నికి జవాబు ఇవ్వవలసింది అమిత్ షా నే. ఆయన వాటి గురించి మాట్లాడకుండా పార్టీ నేతలకు ఏదో క్లాస్ పీకితే ఏమి ప్రయోజనం ఉంటుంది?.
✍️ దీనికి తగ్గట్లు సడన్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళసై కి ప్రాధాన్యం ఇచ్చి స్వయంగా సెక్రటేరియట్ లో స్వాగతం పలకడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. కేసీఆర్ తొలుత ప్రధాని మోదీకి మద్దతు ఇచ్చినా, ఆ తర్వాత కాలంలో తీవ్ర విమర్శలకు వెనుకాడలేదు. కానీ, ఇటీవలికాలంలో ఆయన కాన్ సెంట్రేషన్ అంతా కాంగ్రెస్ పైనే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ.. బీఆర్ఎస్ ,కాంగ్రెస్ ఒకటే అని చెప్పడానికి కొన్ని ప్రశ్నలు వేశారు. వాటిలో ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పని చేస్తున్నదని, కేటీఆర్ కొంతకాలం క్రితం బీజెపీకి వ్యతిరేకంగా కూటమితో ఉంటామని చెప్పారని అంటూ పలు అంశాలతో పాటు ఒక కీలకమైన పాయింట్ ను లేవనెత్తారు.
✍️ హైదరాబాద్ లో ఎకరా రెండు లక్షల రూపాయలకే కాంగ్రెస్‌కు పది ఎకరాలు కేటాయించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు బీఆర్‌ఎస్‌లో చేరినా, వారిపై కాంగ్రెస్ ఎందుకు వేటు వేయలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ కు బిఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు కాంగ్రెస్ తో కలిసి బిఆర్ఎస్, మజ్లిస్ లు ఓటు వేశాయని ఆయన చెప్పారు.గతంలో యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వీటిని చూస్తే కాంగ్రెస్ కూడా ఈ విషయంలో కాస్త ఇబ్బందిపడుతున్నట్లే అనిపిస్తుంది.
అయినా రేవంత్ పరుష వ్యాఖ్యలు, వాటికి బీఆర్ఎస్ ఘాటు సమాధానాల వంటివాటివల్ల ఆ రెంటి మధ్య స్నేహం అన్నదానికి ప్రస్తుతానికి ప్రాధాన్యత తగ్గుతుంది. కానీ, ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ కు మెజార్టీ రాకపోతే ఎందరు ఆ పార్టీలో కొనసాగుతారన్న ప్రశ్న మాత్రం ఎదురు అవుతుంటుంది. ఆ రకంగా చూస్తే బిజెపిని బాగా వ్యతిరేకించిన రోజుల్లో కాంగ్రెస్ కు కాస్త దగ్గరగా ఉన్నట్లు బీఆర్ఎస్ కనిపించినా, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, పరిణామాల ఆధారంగా ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. అమిత్ షా , కిషన్ రెడ్డిలు ఎన్ని చెప్పినా, ముందుగా తమ పార్టీ క్యాడర్ లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడమే బీజేపీకి ప్రధాన సమస్యగా ఉందని చెప్పాలి.అందుకే బీజేపీ తన రాజకీయ పాతివ్రత్యం నిరూపించుకోవడానికే ఖమ్మం సభను ఏర్పాటు చేసినా, ఆ లక్ష్యం ఎంతవరకు సాధించారన్నది డౌటే!.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment