మానసిక శాస్త్రంలో ఒక సంగతి చెబుతారు. ఎవరైనా నిరాశా,నిస్పృహలో కూరుకుపోయినప్పుడు, తాము ఆశిస్తున్న ఫలితం రాదన్న భయం ఏర్పడినప్పుడు వారు ఏమి మాట్లాడతారో వారికే తెలియదట. అంతేకాకుండా వయసు మీద పడిన తర్వాత కూడా అంతా తాను చెప్పిందే వినాలన్న యావ పెరుగుతుందట. దానిని నమ్మాలని కూడా అనుకుంటారట. ఎవరూ తన మాట వినడం లేదని వారికివారే ఆత్మనూన్యతలోకి వెళతారట.అలాగే అన్నీ తానెప్పుడో చేసేశానని ఫీల్ అవుతుంటారట. సరిగ్గా ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే ఉందని చెప్పాలి. ఆయన ప్రసంగాల తీరు చూస్తుంటే ఆయన ఎంతగా మానసిక ఉద్రిక్తతకు గురి అవుతున్నారన్నది తెలిసిపోతోంది.
చంద్రబాబు ప్రసంగాల్లో ద్వేషమే కనబడుతోంది..
తనకంటే చిన్నవాడైన ముఖ్యమంత్రి జగన్ విన్నూత్నంగా అమలు చేస్తున్న స్కీములను ఎదుర్కోవడం ఎలాగో తెలియక, చంద్రబాబు నోటికి వచ్చినట్లు దూషిస్తున్నారు. అదే వైసీపీవారు ఎవరైనా చేస్తే మాత్రం తనను తిడతారా అంటూ గగ్గోలు పెడతారు. ఈనాడు, జ్యోతి, టివి 5వంటి టిడిపి మీడియా సంస్థలు మా బాబోరిని అంత మాట అంటారా అంటూ నానా యాగి చేస్తుంటాయి. కడప, గిద్దలూరు తదితర ప్రాంతాలలో పర్యటిస్తూ చంద్రబాబు చేస్తున్న ఉపన్యాసాలను ఒక్కసారి విశ్లేషించండి. ఆయన ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి జగన్ ను పట్టుకుని కాన్సర్ గడ్డ అని అన్నారంటే చంద్రబాబులో ద్వేషం ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్దం చేసుకోవచ్చు.
నిజానికి శత్రువును కూడా కాన్సర్‌తోతో పోల్చరాదని పెద్దలు చెబుతారు. కాని వయసు రీత్యా తన కొడుకు వయసులో ఉన్న జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. సైకో అని, దరిద్రం అని, ప్రజల రక్తం తాగే మనిషి అని ఇలా ఏవేవో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలేనా వచ్చేది. ఎన్నికలలో గెలవవచ్చు. ఓడవచ్చు. కాని హుందాగా ఉండడం ముఖ్యం. హుందాగా లేకపోతే సరి.. ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రేలాపనలు చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్దులు కొందరు ఒక్కోసారి ఆయనకు ఉన్న ఒక ఆరోగ్య సమస్యను ప్రస్తావించి ఇందువల్లే రాష్ట్రానికి అరిష్టం పట్టిందని అనేవారు. నాకు ఆ వ్యాది పదాలు వాడడం ఇష్టం లేదు.
రూ. 2 లక్షల కోట్లు సంక్షేమం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది
చంద్రబాబు,కరువు కవల పిల్లలని విమర్శించేవారు. ఆయనకు ఉన్న వ్యాధి వల్లే రాష్ట్రం కరువులో ఉందని ప్రచారం చేసేవారు.మరి అది సబబా ?కాదా? అంటే కాదనే చెప్పాలి. కాని సెంటిమెంట్ రాజకీయాలు ఉన్న ఈ రోజుల్లో చంద్రబాబే నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే, మిగిలినవారు ఊరుకుంటారా? చంద్రబాబు మరో మాట కూడా అంటున్నారు. జగన్ డబ్బులు పంచే వ్యక్తి కాదని, రక్తం తాగే మనిషి అని ఆయన అన్నారు. అది నిజమే అయితే పేద ప్రజలకు రెండు లక్షల కోట్లకు పైగా నిధులు పంచుతారా? వారు కరోనా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎంత వ్యయం చేసింది తెలియదా?జగన్ ఏమీ తాను చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి వెబ్ సైట్ నుంచి మానిఫెస్టోని తొలగించలేదు. రైతుల రుణాలన్నిటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆశపోతులని వారినే తిట్టడాన్ని కదా రక్తం తాగే నేతలని అనాల్సింది.
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగవేసినవారిని కదా అలా సంభోధించాల్సింది. నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించి ఎగవేసినవారిని కదా ఆ మాట అనాల్సింది. వీటన్నిటిని పరిశీలిస్తే చాలు.. రాష్ట్రానికి ఎవరు కాన్సర్ గడ్డో,పేదల పాలిట ఎవరు కల్పవృక్షమో తెలుసుకోవచ్చు. ఏపీలో పేద ,దిగువ మద్యతరగతి వర్గాలన్నీ జగన్‌ను కల్పవల్లిగా పరిగణిస్తున్నాయి కనుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తట్టుకోలేక దారుణమైన భాష వాడుతున్నారు. నిజానికి చంద్రబాబు వేటిపై మాట్లాడాలి. జగన్ అవలంభిస్తున్న విధానాలు ఉపయుక్తమా?కాదా?అన్నదానిపై ప్రసంగించాలి.అమ్మ ఒడి స్కీమ్ మంచిదా?కాదా? అన్నది చెప్పాలి. చేయూత కింద మహిళలకు డెబ్బై ఐదువేల సాయం చేయడం సరైనదా?కాదా? అన్నది చెప్పాలి. కాపు నేస్తం, చేనేత నేస్తం వంటి స్కీములు అమలు చేయాలా? వద్దా? అన్నది తేల్చాలి.
ప్రజలు మరిచిపోతారులే అన్నదే చంద్రబాబు నమ్మకం
వీటిపై మాట్లాడే ధైర్యం లేక చంద్రబాబు ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడి పలచన అవుతున్నారు. వీటన్నిటిని తాను వస్తే రద్దు చేస్తానని చెప్పగలరా?పైగా ఇంకా ఎక్కువ ఇస్తానని అంటున్నారు. రామాయపట్నం, భావనపాడు, బందరు పోర్టులన్నీ తానే చేసేశారట. కడప స్టీల్ తెచ్చేశారట. అది నిజమే అయితే ఈపాటికి అవి తయారు అయి ఉండేవి కదా! ప్రజలను మభ్య పెట్టడానికి ఎన్నికల ముందు ఏదో చేసి గాలికి వదలివేసిన సంగతి ప్రజలు మర్చిపోతారులే అన్నది ఆయన నమ్మకం. సైకాలజీలో ఒక ఫోబియా గురించి చెబుతుంటారు. అదేమిటంటే అన్నీ తానే చేసేశానని ఫీల్ అవుతుంటారు.
సెల్ పోన్ కనిపెట్టిన దగ్గరనుంచి హైదరాబాద్ తానే నిర్మించానని చెప్పడం వరకు అనేక విషయాలలో చంద్రబాబు అలాగే మాట్లాడుతుంటారు.దేశంలో రోడ్లు వేయాలని వాజ్ పేయికి తానే చెప్పానంటారు. ఇవన్ని విన్న జనం కూడా నవ్వుకుంటూ ఆషాఢబూతి మాటలే అని సరిపెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా చంద్రబాబును ఇలా దూషించడం లేదు. తోడేళ్లతో పోల్చుతున్నారు. దుష్టచతుష్టయం అని అంటుంటారు. కాకపోతే ఈ మధ్య ముసలాయన అని చంద్రబాబును ఉద్దేశించి అంటున్నారు. ఆ మాట అనవచ్చా ఎవరైనా అడగవచ్చు. చంద్రబాబు చేస్తున్న దూషణలతో పోల్చితే అది చిన్నపదమే. అదీకాక చంద్రబాబు నిజంగానే ముసలాయనే కదా! ఆ ప్రభావం ఆయన ప్రసంగాలలో కనిపిస్తున్నది కదా!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment