\హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి 45 రోజులైనా సాధించింది ఏమీ లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ సాధించింది ఏమైనా ఉందంటే అది వారానికి రెండు ఢిల్లీ టూర్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనంతా ఢిల్లీ నుంచే సాగుతుందని కేటీఆర్ విమర్శించారు. దావోస్‌కు వెళ్లి ప్రపంచవేదికపై పచ్చి అబద్ధాలే మాట్లాడారన్నారు.
‘అనేక విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటుంది. కేఆర్‌ఎంబీ విషయంలో ప్రాజెక్లులు కేంద్రం చేతుల్లోకి వెళ్లాయి. మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయి. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ మాటలు ఒకేలా ఉన్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు కొత్త క్యాంపు ఆఫీసు, కొత్త హైకోర్టు ఎట్లా కడుతున్నారు?, సీఎం మారినప్పుడల్లా కొత్త క్యాంపు ఆఫీసులు వస్తాయా?, మేము కట్టిన ప్రగతి భవన్‌ను ఈగోతో డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్‌రెడ్డి ఇచ్చారు. క్యాబినెట్‌లో చర్చించకుండానే రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. భేషజాల వల్లే ప్రగతిభవన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి వాడటం లేదు.
మేము దావోస్ పర్యటనలకు వెళ్తే బోగస్ అన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనపై సమాధానం చెప్పాలి. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు ఎందుకు వెళ్లారని భట్టి ప్రశ్నించినట్లు ఉంది. రేవంత్‌రెడ్డిపై భట్టి యుద్ధం చేస్తున్నట్లు అనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ ప్రభుత్వంగా మారింది. బెల్టు షాపులు ఎత్తివేస్తామని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
కాళేశ్వరం ద్వారా చుక్క నీరు రాలేదన్నారు. మంత్రి కొండా సురేఖ లక్షా పదివేల ఎకరాలకు రంగనాయక సాగర్ నీళ్లను విడుదల చేసిందుకు ధన్యవాదాలు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వంద రోజుల్లో హామీల అమలును నిలబెట్టుకోవాలి.కోటీ 57 లక్షల మంది మహిళలకు మహాలక్ష్మి ఎప్పటి నుండి ఇస్తారో చెప్పాలి. ఆరు గ్యారెంటీల అమలుకు జీవోలు ఇవ్వండి. ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు.
ఫిబ్రవరి 10లోగా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్ పార్టీ భేటీలు ఉంటాయన్న కేటీఆర్.. కేఆర్‌ఎంబీపై తెలంగాణ ప్రయోజనాల తాకట్టు, పార్టీ అంతర్గత నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ఇక బీఆర్‌ఎస్ పేరు మార్పు అంశంపై చర్చిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.దాంతో బీఆర్‌ఎస్.. మళ్లీ టీఆర్‌ఎస్ కానుందా? అనే చర్చ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment