అప్పట్లో టీడీపీ కార్యకర్తలకే షెడ్లు కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

అప్పట్లో టీడీపీ కార్యకర్తలకే షెడ్లు కేటాయింపు

Published Fri, Aug 23 2024 2:34 AM | Last Updated on Fri, Aug 23 2024 12:54 PM

No Headline

జిల్లాలో ఉపాధి హామీ నిధులతో 1,075 షెడ్లు మంజూరు

2018లో గోకులాల పేరుతో షెడ్ల నిర్మాణం

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీలు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాల నిర్మాణం

నేడు పచ్చనేతల పశువులు, సన్నజీవాలు, కోళ్లకు షెడ్లు మంజూరు

బేస్తవారిపేట: టీడీపీ ప్రభుత్వం ప్రజల సొమ్మును అప్పనంగా బొక్కేసేందుకు మళ్లీ పథకాలు సిద్ధం చేస్తోంది. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగింది. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం ప్రజల సొమ్మును స్వాహా చేయడమే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తోంది. తాజాగా ఉపాధి హామీ పథకం నిధులతో షెడ్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2018లో సైతం నిబంధనలతో సంబంధం లేకుండా టీడీపీ కార్యకర్తలకే షెడ్లు మంజూరు చేశారు.పశువులు, సన్నజీవాలు, కోళ్లకు షెడ్లు నిర్మాణాలు చేపట్టింది. ప్రస్తుతం 2024లో కూడా అదే తరహాలో తమ కార్యకర్తలకు షెడ్లు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు.

జిల్లాకు 1,075 షెడ్లు మంజూరు
జిల్లాలో 38 మండలాలకు 1,075 షెడ్లు మంజూరయ్యాయి. ఒక్కో మండలానికి 25 షెడ్లు మంజూరు చేశారు. తీర ప్రాంతంలోని కొత్తపట్నం, నాగులుప్పలపాడు, ఒంగోలు, సింగరాయకొండ, టంగుటూరు మండలాలకు 50 షెడ్లు చొప్పున కేటాయించారు. షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తుండటం, లబ్ధిదారుడు కేవలం 10 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉండటంతో టీడీపీ కార్యకర్తలు వాటి కోసం పోటీ పడుతున్నారు.

పంచాయతీ తీర్మానం తప్పనిసరి
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మిస్తున్న ఈ షెడ్లకు గ్రామ పంచాయతీ తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. గతంలో చేసినట్లుగా ఈ సారి కూడా టీడీపీ కార్యకర్తలకే షెడ్ల మంజూరు కోసం అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. టీడీపీ కార్యకర్తల దరఖాస్తులకే తీసుకోవాలని కొందరు అధికారులపై పచ్చనేతలు తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. గ్రామ సభలు నిర్వహించి ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాల్సిన బాధ్యత, పర్యవేక్షణ ఉపాధిహామీ అధికారులకు అప్పగించారు. పంచాయతీ తీర్మానం తప్పనిసరిగా తీసుకోవాలి. దరఖాస్తుదారుడు నిజమైన లబ్ధిదారుడా కాదా..పశువులు ఉన్నాయా..లేదా అని పరిశీలించి యూనిట్ల ఎంపిక బాధ్యతను పశువైద్యాధికారులకు అప్పగించారు.

ఆదర్శం..ఆ పాలన..
గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రజలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించింది. పట్టణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా స్థానికంగానే సమస్యల పరిష్కారం కోసం, ప్రజలు వ్యయప్రయాసలకు గురికాకుండా ఉండేందుకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీలు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాల ఏర్పాటు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి వాటిని పట్టించుకోకుండా తమ కార్యకర్తల కోసం షెడ్లు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement