జాతీయ నూతన విద్యా విధానంతో నష్టం
● ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య
పొదిలి: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానంతో నష్టం జరుగుతుందని విద్యార్థులు అనేక కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య అన్నారు. ఏఐఎస్‌ఎఫ్ 20వ జిల్లా మహాసభలు పొదిలిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యను పూర్తిగా కాషాయికరణ, కార్పొరేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పిన మూడోసారి గద్దె నెక్కిన నరేంద్ర మోడీ ఎక్కడ ఎవరికి, ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థి లోకం సమరశీల పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రదాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుల్లాయి స్వామి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని యూనివర్సీటీకి సొంత భవనాలతో పాటు, హాస్టల్ వసతి కల్పించాలన్నారు. ముందుగా విద్యార్థులు పెద్ద బస్టాండ్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కరుణానిధి, జిల్లా సహాయ కార్యదర్శి రామంజనేయులు, మాజీ జిల్లా కార్యదర్శి పి.ప్రభాకర్, సీపీఐ కార్యదర్శి కేవీ రత్నం, జిల్లా నాయకులు పవన్ కళ్యాణ్, స్టాలిన్, ఎంఎల్ నారాయణ, నాసరయ్య, జీపీ రామారావు, కొండయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment