మహిళలు అన్ని రంగాల్లో ముందంజ
ఒంగోలు టౌన్: చదువుతో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో కొనసాగాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ జి. అర్చన అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, అసిస్టెంట్ లైబ్రేరియన్ కె. సంపూర్ణ ఆధ్వర్యంలో సభ జరిగింది. సభకు పలువురు మహిళా అధికారులు, కవయిత్రులు హాజరయ్యారు. ప్రపంచంలో మహిళలు అడుగు పెట్టని రంగం లేదని, అడుగు పెట్టిన ప్రతి చోట విజయం సాధించారని బీసీ వెల్ఫేర్ అధికారి ఎం. అంజల చెప్పారు. సంప్రదాయాలను గౌరవిస్తునే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని, అప్పుడు మాత్రమే ముందడుగు వేయడం సాధ్యమౌతుందని డ్వామా విజిలెన్స్ అధికారి ఝాన్సీ పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళామూర్తులను ఆదర్శంగా తీసుకోవాలని మైనారిటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కె. ధనలక్ష్మి పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ధీరవనితలుగా నిలిచిన ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మిబాయిలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని సభకు అధ్యక్షత వహించిన కవయిత్రి తేళ్ల అరుణ చెప్పారు. తొలుత ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మిబాయి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. కవయిత్రులు మానేపల్లి సూర్యకుమారి, సింహాద్రి జ్యోతిర్మయి, పరాంకుశం కృష్ణవేణి, బీరం అరుణ, సునీత, పుణ్య కీర్తన, సంతోషిణి చదివిన కవితలు, గాయకుడు నూకతోటి శరత్‌కుమార్ పాడిన పాట ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment