ఈవీఎం గోడౌన్‌లో డీఆర్‌ఓ తనిఖీ
ఒంగోలు అర్బన్: స్థానిక మామిడిపాలెంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌ఓ) చిన ఓబులేసు శుక్రవారం తనిఖీ చేశారు. గోడౌన్ షట్టర్లకు వేసిన సీళ్లు, సీసీ కెమెరాల పనితీరుతోపాటు భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి రిజిస్టర్‌ను పరిశీలించారు. డీఆర్‌ఓ వెంట కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్షి, ఇతర రెవెన్యూ అధికారులు ఉన్నారు.
ప్రయాణికుడి బ్యాగ్‌లో రూ.1.10 లక్షలు మాయం
● పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌లో ఘటన
పొదిలి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ ప్రయాణికుని బ్యాగ్‌లో ఉన్న నగదు చోరీ అయిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. విజయవాడకు చెందిన పుల్లెల వెంకటేశ్వర్లు ట్రాక్టర్ల ఫైనాన్స్‌కు సంబంధించి కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వినుకొండ నుంచి పొదిలికి వచ్చాడు. పొదిలిలో బస్సు ఎక్కిన తరువాత బ్యాగ్ జిప్ తీసి ఉండటం గమనించాడు. బ్యాగ్‌లో ఉన్న రూ.1.10 లక్షల నగదు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో మౌఖికంగా ఫిర్యాదు చేశాడు. పోలీస్ సిబ్బంది వచ్చి బస్టాండ్‌లో సీసీ కెమెరాలు పరిశీలించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే, కేసు నమోదు చేస్తామని పోలీసులు బాధితుడికి స్పష్టం చేశారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
ఒంగోలు టౌన్: రైలు కింద పడిన గుర్తు తెలియని యువకుడు ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 13వ తేదీన ఒంగోలులోని రాంనగర్ 6వ లైను వద్ద గల రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు నుంచి 30 ఏళ్ల యువకుడు జారీ పడ్డాడు. తీవ్రంగా గాయలైన అతడిని వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆ యువకుడు 21వ తేదీన మరణించాడు. ప్రమాదం జరిగినప్పుడు సదరు యువకుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒంటి మీద ఆకుపచ్చ చారల లుంగీ ఉంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సమాచారం తెలిసిన వారు ఒంగోలు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్సై టి.అరుణకుమారి సూచించారు.
పోయిన బ్యాగ్‌ను
అప్పగించిన పోలీసులు
ఒంగోలు టౌన్: ఊరికి వెళ్లే హడావుడిలో ఓ వ్యక్తి ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌ను పోలీసులు స్వల్ప వ్యవధిలోనే గుర్తించి భద్రంగా అప్పగించిన సంఘటన శుక్రవారం ఒంగోలులో చోటుచేసుకుంది. తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన దేవతు శ్రీనివాస్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్య చికిత్స కోసం బెంగళూరు బయలుదేరారు. ఇంటి వద్ద ఆటో ఎక్కిన ఆయన రంగారాయుడు చెరువు వద్ద దిగారు. ఊరికి వెళ్లే హడావుడిలో ఉన్న ఆయన ఆటోలో తన బ్యాగు మరిచిపోయారు. అందులో వైద్యం కోసం తెచ్చుకున్న లక్ష రూపాయల నగదు, ఇంటి తాళాలు, పలు డాక్యుమెంట్లు ఉన్నాయి. బ్యాగ్ పోయిన విషయమై హుటాహుటిన తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిసేపటికే ఆ ఆటోను ట్రేస్ చేశారు. అందులోని బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని తాలూకా సీఐ అజయ్‌కుమార్ చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment