ఆధునిక పద్ధతులతో లాభసాటి సాగు
కొనకనమిట్ల: రైతులు ఆధునిక పద్ధతులు పాటించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని వ్యవసాయశాఖ జేడీ కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రం కొనకనమిట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన కోరమాండల్ కోరొకేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల్లో వచ్చే తెగుళ్లు, నివారణ మార్గాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. విచ్చలవిడిగా రసాయన మందులు వాడకుండా అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించాలని సూచించారు. కొనకనమిట్లలో కోరమాండల్ తరఫున కోరొకేర్ సెంటర్‌ను అందుబాటులోకి తేవడం రైతులకు ఉపయోగకరమన్నారు. దూరప్రాంతాలకు వెళ్లి పురుగు మందులు కొనుగోలు చేయకుండా స్థానికంగానే మందులు అందుబాటులో ఉండటం రైతులకు అన్నివిధాల బాగుంటుందన్నారు. పంటల బీమా, యంత్ర పరికరాల గురించి రైతులకు వివరించారు. కోరమాండల్ కోరొకేర్ విజయవాడ మార్కెట్ జోనల్ హెడ్ భానుప్రకాష్, సురేష్ మాట్లాడుతూ.. కొనకనమిట్లలో ఏర్పాటు చేసిన సెంటర్ ఏపిలో రెండోదని వివరించారు. పురుగు మందుల పిచికారీకి అవసరమైన డ్రోన్‌ను రైతులకు అందిస్తాన్నారు. కార్యక్రమంలో దర్శి ఏడీఏ బాలాజీనాయక్, స్థానిక ఏఓ ప్రసన్న రంగలక్ష్మి, కోరొకేర్ సెంటర్ ప్రతినిధులు, మాజీ సర్పంచ్ పి.కొండారెడ్డి, యక్కంటి తిరుపతిరెడ్డి, గొలమారి తిరుపతిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment