విద్యుత్ స్మార్ట్ మీటర్ల అడ్డగింత
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. నగరంలోని నాగేంద్ర నగర్‌లో అద్దాలు తయారు చేసే చిన్న పరిశ్రమకు శుక్రవారం ఉదయం విద్యుత్ శాఖ సిబ్బంది కొందరు స్మార్ట్ మీటర్ బిగిచేందుకు వచ్చారు. అక్కడే ఉన్న సీపీఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు, జి.రమేష్, సయ్యద్ హుసేన్, తంబి శ్రీనివాసరావు, టి.మహేష్ తదితరులు మీటర్లు బిగించడాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్కరణలో భాగంగా వ్యాపార సమూదాయాలు, చిన్న పరిశ్రమలు, గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయమన్నారు. ప్రస్తుతం ఒక్కో మీటర్‌ను 13 వేల రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, ఇప్పుడు ట్రూ అప్ చార్జీల తరహాలోనే రేపు స్మార్ట్ మీటర్ ఖరీదు భారాన్ని కూడా ప్రజలపై వేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్లాబ్ విధానం రద్దయ్యి, ప్రీ పెయిడ్ విధానం అమలులోకి వస్తే మధ్య తరగతి, సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఇప్పటికే ట్రూ అప్ చార్జీల పేరుతో దాదాపు రూ.18 వేల కోట్ల రుపాయల భారాన్ని ప్రజలపై వేశారని, ప్రజలు స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భక్తసింగ్‌రాజా, రాంబాబు, పావని సుబ్బారావు, సంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment