అసమ్మతి చిందులు | - | Sakshi
Sakshi News home page

అసమ్మతి చిందులు

Published Sat, Nov 23 2024 1:18 AM | Last Updated on Sat, Nov 23 2024 1:17 AM

అసమ్మతి చిందులు

అసమ్మతి చిందులు

తమ్ముళ్ల..

అధికార టీడీపీలో అసమ్మతి, వర్గపోరు తారాస్థాయికి చేరాయి. ఒంగోలు నుంచి గిద్దలూరు వరకు అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు భగ్గుమంటున్నాయి. నామినేటెడ్‌ పదవులు ఆశించి భంగపడిన నేతలు రగిలిపోతున్నారు. కష్టపడి అధికారంలోకి వచ్చేందుకు పనిచేసిన వారిని పక్కన పడేశారని, కనీస గుర్తింపు దక్కడం లేదని ద్వితీయశ్రేణి నాయకులు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.

లక్ష్మి దూకుడుకు కళ్లెం...

దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న గొట్టిపాటి లక్ష్మి దూకుడికి కళ్లెం వేయాలని అధిష్టానం భావిస్తోందని సమాచారం. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పదవి వస్తుందని ఆమె వర్గీయులు ఆది నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకూ విడుదలైన జాబితాల్లో ఆమె పేరును కనీసం పరిశీలనకు కూడా తీసుకోలేదని తెలుస్తోంది. మద్యం దుకాణాల విషయంలో లక్ష్మి పెద్ద మొత్తంలో కమీషన్‌ డిమాండ్‌ చేయడం, ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారడం లాంటివి అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అంతేగాకుండా ఎన్నికల ముందు వచ్చిన ఆమె.. సీనియర్‌ నాయకులను పట్టించుకోవడం లేదని, వారి మాటలను పరిగణలోకి తీసుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని కొందరు సీనియర్‌ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమను కాదని ఆమె సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా మందికి నచ్చడం లేదని ప్రచారం జరుగుతోంది. అసంతృప్తిని చల్లార్చేందుకు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుకు కీలక పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

ధికార తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి రాజుకుంటోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గతంగా అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రవీంద్ర మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు వర్గాలు ఒకరి మీద ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎరిక్షన్‌ బాబుకు వ్యతిరేకంగా నాగేంద్ర అనే సీనియర్‌ కార్యకర్త ఆత్యహత్యకు ప్రయత్నించడం అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల సోదరుల పెత్తనంపై తమ్ముళ్లు మండిపడుతున్నారు. దర్శి నియోజకవర్గంలో దిగుమతి నాయకురాలి పెత్తనాన్ని సహించలేమని చెబుతున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఎమ్మెల్యే వైఖరిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కొండపి కథ మరోలా ఉంది. ఈ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు తయారయ్యారని.. ఎవరివైపు ఉండాలో తెలియడం లేదని పార్టీ కేడర్‌ డోలాయమానంలో పడింది. అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యే పెత్తనం ఎక్కువైందని చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తంమ్మీద జిల్లా టీడీపీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందని చెప్పవచ్చు.

‘ఒడా’ చుట్టూ పోరు...

ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఒడా) చైర్మన్‌ పదవికి తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఒడా చైర్మన్‌ పదవి కోసం టీడీపీలో మంత్రి శ్రీనివాసరావు, శింగరాజు రాంబాబు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మంత్రి శ్రీనివాసరావుకు ఈ పదవి ఇస్తానంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. శింగరాజు రాంబాబుకు సైతం దామచర్ల హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఈ ఇద్దరు నాయకులు చైర్మన్‌ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. టీడీపీలో ఇలా ఉంటే.. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకోవడం కొసమెరుపు. ఒంగోలు జనసేన నాయకులకు ఎలాంటి పదవి ఇచ్చేది లేదని, ఒడా పదవిని టీడీపీ నాయకులకు ఇస్తామని లోకేష్‌ చెప్పినట్లు వార్తలు రావడంతో రియాజ్‌ అలకపాన్పు ఎక్కినట్లు సమాచారం. ఆయన గత కొద్దిరోజులుగా దామచర్లకు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గిద్దలూరు జనసేన ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబా కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ పదవిని దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మికి ఇప్పించాలని ఆమె బంధువైన మంత్రి గొట్టిపాటి రవి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒడా పదవి తర్వాత అసంతృప్తి మరింతగా బయటపడే అవకాశం ఉందని తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే దామచర్లపై పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇక, బియ్యం డీలర్‌షిప్‌ కోసం ప్రయత్నించిన పలువురు నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని మధ్యలో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతున్నారు.

యర్రగొండపాలెంలో శ్రుతిమించిన అసమ్మతిరాగం...

జిల్లాలోని మారుమూల నియోజకవర్గమైన యర్రగొండపాలెంలో టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి శ్రుతిమించింది. రెండు గ్రూపులుగా విడిపోయిన పార్టీ నాయకులు పోటాపోటీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌ బాబు, జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రవీంద్ర గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల రవీంద్ర వర్గానికి చెందిన చెకూరి ఆంజనేయులు, షేక్‌ జిలాని, వడ్లమూడి లింగయ్య, అంబటి వీరారెడ్డి ఆధ్వర్యంలో 250 మందికిపైగా కార్యకర్తలు మంగళగిరి వెళ్లి ఎరిక్షన్‌బాబు అవినీతి భాగోతంపై ఫిర్యాదు చేసి వచ్చారు. యర్రగొండపాలెం ఇన్‌చార్జిని మార్చాలని డాక్టర్‌ రవీంద్ర వర్గం డిమాండ్‌ చేసింది. ఒకవేళ ఇన్‌చార్జిని మార్చడం సాధ్యం కాకపోతే కనీసం త్రిసభ్య కమిటీ వేయాలని కోరుతోంది. అయితే అధిష్టానం చూద్దాం..చేద్దాం అంటూ కాలయాపన చేయడం వారికి మింగుడు పడడంలేదు. ఎరిక్షన్‌బాబు ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడంటూ ఆరోపణలు చేస్తూ గురువారం నాగేంద్ర అనే పార్టీ కార్యకర్త ఎన్టీఆర్‌ విగ్రహానికి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించడం, అక్కడి నుంచి అతడిని కాపాడినప్పటికీ ఆగకుండా లారీ కింద పడి చావడానికి ప్రయత్నించడం పరిస్థితికి అద్దం పడుతోంది.

మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో సోదరుల పెత్తనం...

పశ్చిమ ప్రకాశం జిల్లాలో కీలకమైన మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలలో సైతం అసంతృప్తి కథ నడుస్తోంది. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సొంత తమ్ముళ్లు అంతా తామే అన్నట్లుగా వ్యవహారాలు నడపడం కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. పార్టీ విజయం కోసం కష్టపడిన తమకు చివరికి దక్కిందేమీ లేదని పలువురు నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముళ్ల జోరుకు బేజారవుతున్న సీనియర్లు.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకపాత్ర పోషించిన శాసనాల వీరబ్రహ్మం, గునుపూడి భాస్కర్‌ లాంటి వారు పచ్చకండువా పక్కన పెట్టి తిరుగుతున్నారు. కనిగిరిలో ఎమ్మెల్యే ఏకఛత్రాధిపత్యంతో కొందరు నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారు. కనిగిరిలోని అధికార పార్టీకి చెందిన సామాజికవర్గం రాష్ట్ర మైనింగ్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌ దామచర్ల సత్యల వద్దకు వెళ్లి పనులు చక్కబెట్టుకుంటున్నారని సమాచారం.

ఎమ్మెల్యేల ఏకపక్ష ధోరణిపై రగులుతున్న కేడర్‌ అన్ని నియోజకవర్గాల్లోనూ అదే తీరు పార్టీ విజయం కోసం కష్టపడితే మొండిచేయి చూపిస్తారా? టీడీపీలో చెలరేగుతున్న అసంతృప్తులు మంగళగిరి చేరిన యర్రగొండపాలెం పంచాయితీ ఒంగోలులో ‘ఒడా’ కోసం సిగపట్లు

కొండపిలో అసంతృప్తులకు తాయిలాలు...

కొండపి నియోజకవర్గంలో అసంతృప్తి నాయకులను చల్లార్చేందుకు ఇటీవల తాయిలాలు పంపిణీ చేసినట్టు తెలిసింది. డోలా బాలవీరాంజనేయస్వామికి మంత్రి పదవి లభించినా.. ఇక్కడ దామచర్ల సత్య పెత్తనం చెలాయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. అధికారులతో మాట్లాడటం, బదిలీలు, పోస్టింగుల దగ్గర నుంచి మద్యం, బియ్యం, మైనింగ్‌ లావాదేవీలు, పశువుల సంత, ఆక్వాలకు సంబంధించిన వసూళ్లన్నీ సత్య చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సత్య పెత్తనం ఏంటని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన సత్య.. ఇటీవల మండల నాయకులను పిలిపించి వారి వారి స్థాయిని బట్టి తాయిలాలు ఇచ్చి పంపించినట్లు ప్రచారం. తాయిలాలు అందని కొందరు నేతలు మేమేం తక్కువంటూ మండిపడుతున్నట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా అధికారులు సైతం సత్య పెత్తనంపై లోలోపల చిరాకుపడుతున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement