‘కూటమి’ విఫలం
శాంతిభద్రతల పరిరక్షణలో
త్రిపురాంతకం/నరసరావుపేట: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. త్రిపురాంతకం మండలంలోని నడిపాలెం పొలాల్లో దాడికి గురై తీవ్రంగా గాయపడి నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నాయకుడు ఈశ్వరరెడ్డిని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే పరామర్శించారు. త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని నడిపాలెం పొలాల్లో గల తన భూమి వద్ద శుక్రవారం ఈశ్వరరెడ్డి పనులు చేయించాడు. కూలీలు నీరు కావాలనగా, పాత అన్నసముద్రం వెళ్లి తిరిగి రాలేదు. రోడ్డుపై తలకు బలమైన గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఈశ్వరరెడ్డిని అటుగా వచ్చిన వారు గమనించి వినుకొండ వైద్యశాలకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట తరలించారు. ఈశ్వరరెడ్డిది పెద్దారవీడు మండలం శివాపురం గ్రామం. కొంత కాలంగా భూవివాదం ఉండగా, ఇటీవల రాజీ చేసుకుని పొలంలోకి దిగాడు. ఈ నేపథ్యంలో అతనిపై మారణాయుధాలతో దాడి జరిగింది. ప్రస్తుతం ఈశ్వరరెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సీఐ అసాన్, ఎస్‌ఐ శివబసవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో అరగంటకు ఒక నేరం...
నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఈశ్వరరెడ్డిని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒక మూల అరగంటకో హత్య, దాడి జరుగుతూనే ఉన్నాయన్నారు. నేరస్తులను శిక్షిస్తారనే భయం లేకపోవడం వలనే దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఒక చిన్న పొలం తగాదా విషయంలో గొడ్డలి, కత్తులతో నరకడంతో చావుబతుకుల మధ్య వెంటిలేటర్‌పై ఈశ్వరరెడ్డి ఉన్నాడంటే రాష్ట్రంలో ఏరకమైన పరిపాలన సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు, ఆడబిడ్డలకు రక్షణ లేదని, నేరం చేయడానికి ఎవరూ భయపడట్లేదని అన్నారు. వందల కేసులు రోజూ నమోదవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో గత ఐదు నెలల్లో 7,393 మంది మహిళలపై లైంగిక దాడులు, భౌతిక దాడులు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా వారే చెప్పారన్నారు. రాబోయే ఐదేళ్లలో 35 వేలకుపైగా సంఘటనలు జరగనిచ్చి ఒక రికార్డు బుక్ చేయాలనుకుంటున్నారా.. అని ఎద్దేవా చేశారు. ప్రజల రక్షణ గొలికొదిలేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తన నియోజకవర్గంలో ఈ క్షతగాత్రుడు ఈశ్వరరెడ్డికి త్రిపురాంతకంలో 14 ఎకరాల పొలం ఉందన్నారు. దానిపై కోర్టులో దావాలు, గొడవలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈశ్వరరెడ్డికి ప్రత్యర్థులైన వారిని పోలీసులు ముందుగానే కట్టడి చేసి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని మహిళలకు తాము రక్షణ కల్పించలేమని, వారి కుటుంబ సభ్యులే రక్షణ చేసుకోవాలని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దీని అర్థం మేం ఏమీచేయలేమని చెప్పకనే చెప్పినట్లుగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలుచేయలేక తమకు ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని ఎగ్గొట్టారన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఆ పదవి ఇవ్వకపోవడం ఇదే మొదటిసారని అన్నారు. వారు చేసే తప్పులను బయటకు తీస్తారనే ఉద్దేశంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీఏసీ సభ్యులైన తమకు ఆ పదవి రాకుండా చేశారన్నారు. 1981లో బీజేపీకి పార్లమెంటులో రెండే రెండు సీట్లు ఉంటే పీఏసీ పదవి ఇచ్చారన్నారు. పదవీ వ్యామోహం వలనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరో పదేళ్లు ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారన్నారు. వీరికి పదవీ వ్యామోహం తప్పితే ప్రజల కోసం పోరాటం చేసే ఆలోచన ఏకోశానా లేదన్నారు. ఇప్పటికై నా ప్రజలకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు.
పాలకులకు పదవీ వ్యామోహం తప్ప ప్రజల గురించి ఆలోచన లేదు యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నడిపాలెం పొలాల్లో దాడికి గురైన వ్యక్తికి నరసరావుపేట ఆస్పత్రిలో పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment