26న జాబ్ మేళా
ఒంగోలు వన్‌టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ – జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ చీమకుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3 కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె.రవితేజ యాదవ్ తెలిపారు. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్, జెర్సీ డెయిరీ, బ్రహ్మసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కంపెనీలు పాల్గొంటాయన్నారు. జిల్లాలోని 19 నుంచి 32 సంవత్సరాల వయసు మధ్య గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ షేక్ బాషా (9963005209)ను సంప్రదించాలని కోరారు.
నేడు, రేపు ఓటరు నమోదు కార్యక్రమాలు
ఒంగోలు అర్బన్: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేక ప్రచార రోజులు నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌ఓలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశంతో పాటు ఫారం 6, 7, 8 కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఎన్నికల విభాగం అధికారులు కోరారు.
ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే ఉపకార వేతనాలు
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో డిగ్రీ, పీజీ, అన్ని రకాల టెక్నికల్, నాన్‌టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న ఎస్సీ విద్యార్థులకు వారి బ్యాంకు ఖాతాల్లోనే ఉపకార వేతనాల నగదు జమ చేయనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా చెల్లిస్తోందన్నారు. మిగిలిన ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కళాశాలల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థులకు మినహా మిగిలిన విద్యార్థుల ఉపకార వేతనాలను ఎఫ్‌ఆర్‌ఎస్ ఆధారంగా హాజరును పరిగణలోకి తీసుకుని కళాశాల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు వివరించారు. నూతన మార్గదర్శకాలు, రెన్యువల్ నూతన ఉపకార వేతనాలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.
ఏఆర్ డీఎస్పీగా శ్రీనివాసరావు
ఒంగోలు టౌన్: ఏఆర్ డీఎస్పీగా కె.శ్రీనివాసరావును నియమిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కర్నూలు ఏఆర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఒంగోలు ఏఆర్‌లో పనిచేస్తున్న పి.చంద్రశేఖర్‌ను తిరుపతి ఏఆర్‌కు బదిలీ చేశారు.
మహిళలపై పెరిగిన హింసకు వ్యతిరేకంగా పక్షోత్సవాలు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో రోజురోజుకూ మహిళలపై పెరిగిపోతున్న హింసకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు నిర్వహించనున్న పక్షోత్సవాలను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రజా సంఘాల కార్యాలయంలో ఐద్వా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై హింస విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మత్తు పదార్థాలకు నిలయంగా మారిందన్నారు. లైంగిక దాడులు, భౌతిక దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయేందుకు మత్తు పదార్థాలే కారణమన్నారు. మద్యం, మత్తు పదార్థాలను నిషేధించి పెరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలపై హింసను వ్యతిరేకించే వారంతా పక్షోత్సవాలలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఎన్.మాలతి, జి.ఆదిలక్ష్మి, కె.రాజేశ్వరి, బి.పెద్ద గోవిందమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment