గ్రామ కంఠంపై టీడీపీ నేతల కన్ను
జరుగుమల్లి (సింగరాయకొండ): జరుగుమల్లి మండలంలోని పీరాపురం గ్రామంలో గ్రామకంఠం భూమిపై అధికార టీడీపీ నాయకుల కన్ను పడింది. పోలేరమ్మ గుడి పేరుతో ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్రకు తెరతీశారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. గ్రామకంఠంలో రైతులకు చెందిన పొగాకు బ్యారన్, స్థలాలు ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
పీరాపురం గ్రామంలో టీడీపీకి చెందిన కొందరు పోలేరమ్మ గుడికి స్థలం కావాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి ఇటీవల వినతిపత్రం సమర్పించారు. ఈ అర్జీని పరిశీలించమని జరుగుమల్లి తహసీల్దార్ జనార్దన్‌కు మంత్రి సూచించారు. దీనిపై శుక్రవారం తహసీల్దార్ జనార్దన్.. సర్వేయర్, ఎన్‌ఎన్ కండ్రిక పంచాయతీ సెక్రటరీ అశోక్‌కుమార్‌ను వెంటబెట్టుకుని వెళ్లి గ్రామకంఠం స్థలంలో కొలతలు వేసి హద్దులు నిర్ణయించారు. అయితే గ్రామకంఠ స్థలాన్ని ఆనుకుని స్థలాలు, పొగాకు బ్యారన్లు ఉన్నాయని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు ఎలా కొలతలు వేస్తారని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలతలు వేసిన స్థలానికి, బ్యారన్‌లకు మధ్య మూడు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతులో కాలువ తీశారని, తాము బ్యారన్‌ల వద్దకు ఎలా వెళ్లాలని రైతు మారంరెడ్డి గంగాధర్‌రెడ్డి అధికారులను నిలదీశారు. రైతులపై ఈ విధంగా కక్షసాధింపు చేస్తారా అని ప్రశ్నించారు. అధికారులు వేసిన కొలతల్లో తమ స్థలం సుమారు 13 సెంట్లు ఉందని, అడిగితే మీ డాక్యుమెంట్లు తెచ్చుకోండి పరిశీలిస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ జనార్దన్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి అశోక్‌కుమార్ గ్రామకంఠం స్థలాన్ని కొలిచి హద్దులు నిర్ణయించమని కోరారని, ఆ ప్రకారం తాము వచ్చి స్థలానికి కొలతలు వేసి హద్దులు నిర్ణయించామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి అశోక్‌కుమార్ మాట్లాడుతూ గ్రామకంఠం స్దలానికి కొలతలు వేస్తున్నాం.. రావాలని తహసీల్దార్ చెప్పారని, ఆయన సూచన మేరకే తాను వచ్చానని పేర్కొనడం గమనార్హం. ఈ వివాదంపై రెవెన్యూ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా జరుగుతుంటే.. మధ్యలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. గ్రామ కంఠానికి అనుకుని ఉన్న స్థలానికి చెందిన రైతులు మారంరెడ్డి గంగాధర్‌రెడ్డి, బండి శ్రీనివాసులరెడ్డి, ఎల్లావుల శ్రీనివాసులరెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామకంఠం స్థలానికి కొలతలు వేస్తున్నారని, మీరు అక్కడకు వెళ్లవద్దని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కూర్చోవాలని లేదా గ్రామం వదిలి బయటకు వెళ్లాలని పోలీసులు హెచ్చరించారు. గ్రామంలో ఉంటే కేసులు బనాయిస్తామని హెచ్చరించారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.
నాడు ఆందోళన.. నేడు ఆ స్థలం కావాలంటూ డ్రామా..!
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆ గ్రామ టీడీపీ నాయకులు పోలేరమ్మ గుడి స్థలాన్ని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఆక్రమించారని, దానిని కాపాడాలని అప్పట్లో నానాయాగి చేశారు. జరుగుమల్లి మండల కేంద్రంలో ర్యాలీ కూడా చేశారు. తర్వాత ఇదేమని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై ఆడ, మగా తేడా లేకుండా దాడి చేశారు. చివరికి గాయపడిన వారిని కారులో ఆస్పత్రికి తీసుకెళ్తుంటే కారుకు అడ్డంగా నిలబడి మరీ అడ్డుకున్నారు. 108 రావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఇప్పుడు అదే టీడీపీ నాయకులు మంత్రి స్వామికి పోలేరమ్మ గుడికి స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీ నాయకులు అలా అడిగారో లేదో ఇటు రెవెన్యూ, అటు పోలీసు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుడి కోసం స్థలం కావాలంటూ మంత్రికి వినతి రెవెన్యూ, పోలీస్ అధికారుల అత్యుత్సాహం హడావిడిగా కొలతలు తీసిన రెవెన్యూ అధికారులు కార్యదర్శి అడిగితే కొలిచామంటున్న తహసీల్దార్ తహసీల్దార్ పిలిస్తే వచ్చానంటున్న గ్రామ కార్యదర్శి స్థలం వద్దకు వెళితే అరెస్టు చేస్తామంటూ పోలీసుల హెచ్చరికలు ఆందోళనలో రైతులు, గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment