అమిత్‌షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి
ఒంగోలు టౌన్: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని, పార్లమెంటు సాక్షిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కుల విమోచన పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బి.రఘురాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్యర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ పార్లమెంటులో అంబేడ్కర్‌ను అవమానించడమంటే సాక్షాత్తు రాజ్యాంగాన్ని, దేశభక్తులను అవమానించినట్లే అని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఎన్నికై న మంత్రి రాజ్యాంగ నిర్మాతను కించపరచడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ సంఘటనను దేశ ప్రజలంతా ఖండించాలని కోరారు. సమాజంలో సర్వసమానతను కాంక్షించి అనేక పోరాటాలు చేసిన మహనీయుడు అంబేడ్కర్‌పై నోరు పారేసుకోవడం అమిత్‌షా దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. నిరసనలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలకోటయ్య, రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు మంచిగులపాటి శ్రీను, డీ వైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో కె.రమాదేవి, చీకటి శ్రీనివాసరావు, కరిముల్లా, తిరుపతి రావు, మోజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment