నిద్దరోతున్న నిఘా | - | Sakshi
Sakshi News home page

నిద్దరోతున్న నిఘా

Published Fri, Dec 20 2024 12:51 AM | Last Updated on Fri, Dec 20 2024 12:56 AM

నిద్ద

నిద్దరోతున్న నిఘా

జిల్లాలో ఎక్కడ చూసినా దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రయితే చాలు దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రెక్కీ చేయడం, రాత్రి కన్నం వేయడం నిత్యకృత్యమైపోయింది. ఇంటికి తాళాలు వేసి ఉంటే చాలు తెల్లారేసరికల్లా ఇంట్లో నగదు, నగలు మాయమైపోతున్నాయి. దుకాణాలను కూడా వదిలి పెట్టడం లేదు. ఒకవైపు దొంగతనాలు జరుగుతున్నా అరికట్టని పోలీసులు.. సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టారంటూ అడ్డగోలు కేసులు వేయించిన అధికార పార్టీ నేతల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒంగోలు టౌన్‌: జిల్లాలో దొంగల బెడద పెరిగిపోయింది. నిత్యం ఒక్కడో ఒక చోట దొంగతనం జరుగుతూనే ఉంది. ఇటీవల ఒకే రోజు పొదిలిలో రెండు దుకాణాల్లో దొంగలు పడి దోచుకెళ్లారు. కంభంలో ఒకేరోజు మూడు దుకాణాల్లో దొంగలు పడ్డారు. ఒంగోలులోని రద్దీ ప్రాంతంలో ఒక హోటల్లో దొంగలు పడ్డారు. అలాగే ఒక ఇంట్లో దొంగలు పడి భారీగా దోచుకెళ్లారు. ఇలా ప్రతి రోజు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.

రద్దీ ప్రాంతాల్లో చోరీలతో ప్రజల్లో ఆందోళన:

ఎక్కడో ఊరి బయట దొంగలు పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగలు పడుతున్నారు. నగరం నడిబొడ్డున దర్జాగా చోరీలకు తెగబడుతున్నారు. పొదిలిలోని విశ్వనాథపురంలో ఆర్టీసీ బస్టాండు, దానికి సమీపంలోనే సినిమా హాలు ఉంది. దీంతో అక్కడ ఎప్పుడు చూసినా జనాలు తిరుగుతూనే ఉంటారు. అలాంటి చోట దొంగలు పడ్డారు. ఒకే రోజు రెండు దుకాణాల షెట్టర్లను పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. కోటి అనే వ్యక్తికి చెందిన దుకాణంలో ఏకంగా రూ.5 లక్షలు ఎత్తుకెళ్లారు. షఫి అనే వ్యక్తి దుకాణంలో కేవలం రూ.3 వేలు ఉంటే అవీ తీసుకెళ్లారు. అలాగే ఒంగోలులో కూడా రద్దీ ప్రాంతంలో దొంగలు పడడం సంచలనం సృష్టించింది. నగరంలోని అద్దంకి బస్టాండు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ ప్రైవేటు బస్సు ఏజన్సీలు ఉన్నాయి. అంతటి రద్దీ ప్రాంతంలో దొంగలు పడ్డారు. అద్దంకి బస్టాండ్‌లోని బిలాల్‌ హోటల్‌ రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత మూసివేసి వెళ్లిన నిర్వాహకులు మరుసటి రోజు ఉదయం వచ్చి చూసే బీరువా తెరచి ఉంది. వెనక తలుపులు పెకిలించి ఉండడంతో దొంగలు పడినట్లు నిర్ధారించుకున్న హోటల్‌ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బంగారం దుకాణాలే టార్గెట్‌:

ఇదిలా ఉండగా బంగారం దుకాణాలను టార్గెట్‌గా చేసుకొని కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత నెల 21వ తేదీ చీమకుర్తిలోని సీఎస్‌ఎన్‌ బంగారు దుకాణంలో పట్టపగలే దొంగలు చోరీకి తెగబడ్డారు. బంగారు ఉంగరం కావాలంటూ ఒక యువకుడు దుకాణానికి వచ్చాడు. కొన్ని రకాల మోడళ్లు చూపించాలని కోరాడు. ఒక ట్రేలో కొన్ని బంగారు ఉంగరాలు తీసుకొచ్చి చూపిస్తుండగా దుకాణదారునితో మాటలు కలిపాడు. రెండో కంట పడకుండా ట్రేలో ఉన్న బంగారు నగలను జేబులో వేసుకుని జారుకున్నాడు. అలాగే డిసెంబర్‌ 2వ తేదీ తాళ్లూరు మండలంలో తెలంగాణకు చెందిన తల్లీకూతుళ్లు ఒక బంగారు దుకాణంలో చోరీ చేసి పట్టుబడ్డారు. మండలంలోని తూర్పు గంగారంలో విష్ణు జ్యూయలరీలో చెవి కమ్మలు కావాలంటూ వచ్చిన ఆ జంట దొంగలు యజమాని కళ్లుగప్పి 6 జతల కమ్మలు తస్కరించారు. వాటి స్థానంలో తన వద్ద ఉన్న రోల్డ్‌గోల్డ్‌ కమ్మలను ఉంచారు. ఆ తరువాత ఈ విషయాన్ని గమనించిన దుకాణ యజమాని పోలీసులను ఆశ్రయించాడు.

మోటారు బైకుల్లో పెట్రోలు...

ఫ్రిజ్‌లో కూల్‌డ్రింక్స్‌లను కూడా...

కంభం గ్రామంలో ఒకే రోజు మూడు దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అర్బన్‌ కాలనీలోని సయ్యద్‌ మహబూబ్‌కు చెందిన దుకాణంలో తాళం పగులగొట్టి చేతికి అందిన వస్తువులను దోచుకెళ్లారు. చోరీ చేసి పోతూ పోతూ దారిలో కనిపించిన మోటారు బైకుల నుంచి పైపులు పీకేసి పెట్రోలు తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి కందులాపురం పంచాయతీ పరిధిలోకి వచ్చే తర్లుపాడు రోడ్డులోని ఒక చిల్లర దుకాణం తాళాలు పగులగొట్టి రూ.8,500 నగదును తస్కరించారు. అంతేకాకుండా ఫ్రిజ్‌లో ఉంచిన కూల్‌ డ్రింక్స్‌ను కూడా వదిలి పెట్టలేదు. దాని పక్కనే ఉన్న అల్లూరయ్య అనే వ్యక్తికి చెందిన వెల్డింగు షాపులో కూడా ఇదే తరహాలో దోపిడీకి పాల్పడ్డారు. ఒకేరోజు రాత్రి మూడు దుకాణాల్లో చోరీ జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

యర్రగొండపాలెంలో దొంగల్లుడు

యర్రగొండపాలెం మండలంలోని గుర్రపుశాల గ్రామానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్న ముండ్ల రామయ్య కొద్దిరోజులుగా అత్తారింట్లోనే ఉంటున్నాడు. బెట్టింగులకు అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాలకు చేతిలో డబ్బులు లేకపోవడంతో దొంగగా మారాడు. గ్రామస్తులు పనుల కోసం వెళ్లడం గమనించిన అతడు తీరిగ్గా రోజుకు నాలుగు ఇళ్ల చొప్పన ఎంపిక చేసుకొని దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. కేవలం మూడు రోజుల్లో 12 ఇళ్లకు కన్నం వేసి రూ.7 లక్ష వరకు దోచుకున్న రామయ్య మూడో కంటికి తెలియకుండా ఊరు వదిలి పారిపోయాడు.

నిద్రపోతున్న పోలీసుల గస్తీ:

జిల్లాలో జరుగుతున్న దొంగతనాలను గమనిస్తే పోలీసుల గస్తీ ఏమైందన్న ప్రశ్నలు ఉత్పన్నం కాకమానదు. కంభంలో జరిగిన దొంగతనాలు దొంగలు తీరిగ్గా చేసినట్లు తేటతెల్లం అవుతోంది. అర్బన్‌ కాలనీలో దుకాణంలో చోరీ చేసిన దొంగలు ఆ తరువాత మోటారు బైకుల నుంచి పెట్రోలు దొంగలించారంటే అదే ప్రాంతంలో చాలా సేపు గడిపినట్లు తెలుస్తోంది. 6 నెలలుగా జిల్లాలో చోరీలు పెరిగిపోయాయి. రాత్రి 10 గంటల తరువాత ఎక్కడా పోలీసులు కనిపించడంలేదు. అసలే చలికాలం కావడంతో ప్రజలు ముసుగుతన్ని ఇళ్లలో పడుకుంటున్నారు. దానికి తోడు పోలీసుల గస్తీ లేకపోవడంతో దొంగలకు అలుసుగా మారిందన్న విమర్శలు వినవస్తున్నాయి.

జిల్లాలో జోరుగా దొంగతనాలు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట చోరీకి పాల్పడుతున్న దొంగలు శాంతి భద్రతల కంటే కక్షసాధింపు చర్యలపైనే పోలీసుల దృష్టి రాత్రివేళ గస్తీ నిల్‌

రోజుల తరబడి హైదరాబాద్‌లో ఇద్దరు ఎస్‌ఐలు:

అసలే జిల్లాలో చోరీలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అయినా సరే మాకేవీ పట్టవన్నట్లున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఎప్పుడో సోషల్‌ మీడియాలో ఏదో కామెంట్‌ చేశారని ఇప్పుడు పోలీసులు హడావుడి చేయడం విమర్శల పాలవుతోంది. వైజాగ్‌, హైదరాబాద్‌, సత్తెనపల్లి, చిలకలూరిపేటలకు సోషల్‌ మీడియా కేసులపై పోలీసులను తిప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కోసం మద్దిపాడు, నాగులుప్పలపాడు ఎస్‌ఐలను రోజుల తరబడి హైదరాబాద్‌ చుట్టూ తిప్పడం జనానికి విస్మయం కలిగించింది. ఇప్పటికై నా జిల్లాలో జరుగుతున్న చోరీలను అరికట్టి భద్రత, భరోసా కల్పించాలని జనం కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నిద్దరోతున్న నిఘా 1
1/2

నిద్దరోతున్న నిఘా

నిద్దరోతున్న నిఘా 2
2/2

నిద్దరోతున్న నిఘా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement