నాన్న పోయారు.. ఇంటికి రా కన్నా..!
ఒంగోలు టౌన్: తప్పిపోయిన కుమారుడి కోసం రెండున్నరేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన తండ్రి గుండెపగిలింది. చివరి శ్వాస దాకా కుమారుడి ఆచూకీ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన ఆ పెద్దాయన గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తండ్రి ఆఖరి చూపుకై నా కుమారుడు వస్తాడని అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని అలాగే ఉంచి ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఒంగోలు పట్టణానికి చెందిన చాకిచర్ల గోవిందరావు(56) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ పౌరోహిత్యం కూడా చేస్తుంటారు. ఆయనకు ఇద్దరు సంతానం. అమ్మాయి నాగ పావని ఎమ్మెస్సీ చేస్తోంది. కుమారుడు వెంకటశరత్‌కుమార్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంటర్ చదువుతున్నాడు. 2022 సెప్టెంబర్‌లో కుమారుడు శరత్‌కుమార్ ప్యాసింజర్ రైల్లో నూజివీడు కళాశాలకు బయలుదేరాడు. రాత్రి కావడంతో కాలేజీలోకి రానివ్వరని విజయవాడ కృష్ణలంక జంక్షన్ వద్ద దిగాడు. విజయవాడలో ఉన్న పెదనాన్న గోపాలకృష్ణ ఇంటి చిరునామా అడిగేందుకు రైలు దిగిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడాడు. అంతే ఆ తర్వాత మళ్లీ ఫోన్ రాలేదు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్విచ్ఛాఫ్ అనే వస్తోంది. దాంతో విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు తీసుకోలేదు. ఒంగోలులో ఫిర్యాదు చేయాలని సూచించడంతో ఇక్కడకు వచ్చి ఎస్పీ కార్యాలయంలో సెప్టెంబర్ 20న ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుమారుడి ఆచూకీ కోసం గోవిందరావు, పద్మావతి దంపతులు పోలీసు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా శరత్ ఆచూకీ లభించకపోవడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గోవిందరావు ఉంటోంది.. అద్దె ఇల్లు కావడంతో మృతదేహాన్ని బ్రాహ్మణ ఆరామక్షేత్రంలో ఉంచారు. బిడ్డ ఇంకా వస్తాడేమోనన్న ఆశతో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
రెండున్నరేళ్ల కిందట తప్పిపోయిన కుమారుడు
కుమారుడిపై దిగులు పెట్టుకుని గుండెపోటుతో తండ్రి మృతి
మృతదేహాన్ని అలాగే ఉంచి కుమారుడి కోసం కుటుంబ సభ్యుల ఎదురు చూపులు
Comments
Please login to add a commentAdd a comment