● రూ.లక్షన్నర నగదు, వెండి వస్తువుల అపహరణ
కంభం: ఓ ఇంట్లో దొంగలు పడి రూ.లక్షన్నర నగదు, మూడు వెండి గిన్నెలు అపహరించుకెళ్లిన సంఘటన కంభం పట్టణంలోని అంకాళమ్మవీధిలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కంభం సచివాలయం–2 సమీపంలో నివాసం ఉంటున్న గంజి చిన్నవెంకటేశ్వర్లు మార్కాపురంలో ఓ శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం తిరిగి ఇంటికి రాగా తలుపు తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. మార్కాపురం క్లూజ్ టీమ్ సభ్యులు చేరుకుని వేలిముద్రలు సేకరించారు. బాధితుడు మాట్లాడుతూ అరటి గెలలు అమ్మగా వచ్చిన డబ్బును అప్పులు తీర్చే నిమిత్తం ఇంట్లో ఉంచినట్లు తెలిపారు. ఊరికి వెళ్తూ వరండాలో తాళం చెవి దాచిపెట్టి వెళ్లామన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కంభంలో చోరీలు అధికంగా జరుగుతుండటంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.
దామచర్ల అవినీతిపై లేఖాస్త్రం
● ఎమ్మెల్యే దామచర్లపై సీఎంకు ఫిర్యాదు ?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అవినీతికి పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమేరకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్న లేఖ రెండు రోజులుగా వాట్సప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ లేఖపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఒంగోలు నియోజకవర్గ టీడీపీ అభిమానులు, కార్యకర్తలు సీఎంకు ఫిర్యాదు చేశారా? లేక ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు లేఖ సృష్టించి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారా అనేది సందేహంగా మారింది. టీడీపీ అభిమానులే ఈ ఫిర్యాదు చేసి ఉంటే ఫిర్యాదు లేఖను సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందన్నది తెలియాల్సి ఉంది. ఈ లేఖ విషయంపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment