చర్చలు కాదు.. పంటలకు మద్దతు ధర కావాలి
ఒంగోలు సిటీ: కేంద్ర ప్రభుత్వ రైతాంగ, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన ఒంగోలులో నిర్వహించనున్న జిల్లా స్థాయి మోటారు సైకిల్, ట్రాక్టర్ ర్యాలీలను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నం పెట్టే రైతుల ను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ధ్వజమెత్తారు. రైతు ఉద్యమానికి తలవంచి రద్దు చేసిన నల్ల వ్యవసాయ చట్టాలను తిరిగి అమలు చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సహకార, వ్యవసాయ సాంకేతిక చట్టాలు మొత్తం రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీల పెత్తనం కిందకి తెచ్చేందుకేనని దుయ్యబట్టారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని కాపాడుతున్న కౌలు రైతులకు నేరుగా పంట రుణాలు ఇవ్వడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం సంభవిస్తే పరిహారం కౌలు రైతులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డే హనుమారెడ్డి, జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు, జిల్లా కార్యదర్శి లలిత కుమారి, కె.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక
విధానాలను కేంద్రం విడనాడాలి
కార్మిక చట్టాలు, స్వామినాథన్
సిఫార్సులు అమలు చేయాలి
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ
ఈ నెల 26న మోటార్ సైకిల్,
ట్రాక్టర్ ర్యాలీ
సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ రంగారావు
Comments
Please login to add a commentAdd a comment